Induction Stove Safety: కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడటంతో.. సిలిండర్ కొనడం ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే. అందుకే సామాన్యులు, ముఖ్యంగా మధ్యతరగతి ఇళ్లల్లో గ్యాస్ ఆదా చేయడానికి ఇండక్షన్ స్టవ్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. కరెంటు తక్కువ ఖర్చవుతుందని, వంట కూడా వేగంగా పూర్తవుతుందని వీటిని ఈ మధ్య తెగ కొంటున్నారు. అయితే, ఇక్కడే చాలామంది పెద్ద పొరపాటు చేస్తున్నారు.
తక్కువ ధరకే వస్తుంది కదా.. అని నాసిరకం స్టవ్‌లను తెచ్చుకుంటున్నారు. అది ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు అని తాజాగా నర్సింగ్‌పూర్‌లో జరిగిన ఓ ఘటన గుర్తుచేస్తోంది. వంట చేస్తున్న సమయంలో ఒక్కసారిగా స్టవ్ పేలిపోవడంతో ఓ కుటుంబం మొత్తం తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. జనాలంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఖైరీనాకా గ్రామానికి చెందిన హేమ అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి వంటగదిలో పని చేసుకుంటోంది. గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల ఆమె గత 6 నెలలుగా ఇండక్షన్ స్టవ్‌నే వాడుతోంది. ఇక పిల్లల కోసం ఇండక్షన్‌పై కిచిడీ పెట్టింది. వంట దాదాపు పూర్తయిపోయింది అనుకునే లోపే.. ఒక్కసారిగా పెద్ద శబ్దం. ఏమైందో అని తేరుకునే లోపే ఇండక్షన్ స్టవ్ బాంబులా పేలిపోయింది. ఆ పేలుడు ధాటికి దాని పైన ఉండే గ్లాస్ ముక్కలు ముక్కలై గదంతా పడ్డాయి. అదృష్టవశాత్తూ ఆ మహిళ, పిల్లలు కొంచెం దూరంగా ఉండటంతో సరిపోయింది కానీ, లేదంటే ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది.
అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగిందని ఆరా తీస్తే.. అది క్వాలిటీ లేని స్టవ్ అని తేలిందట. ఆరు నెలల క్రితమే కొన్న స్టవ్ ఇలా పేలిపోవడం ఏంటని ఆ కుటుంబం షాక్ అయ్యిందట. షాపు యజమానిని అడిగితే, ‘వారంటీ ఉంది కదా.. కొత్తది ఇస్తాను’ అని చాలా సింపుల్‌గా చెప్పేశాడు. కానీ, ఒకవేళ ఆ పేలుడులో ఏమైనా జరగరానిది జరిగితే ఆ కొత్త స్టవ్ ఏం చేసుకుంటారు? అందుకే నిపుణులు పదే పదే చెబుతున్నారు.. తక్కువ ధరకే వస్తుంది కదా అని ISI మార్క్ లేని పిచ్చి పిచ్చి కంపెనీల స్టవ్‌లు కొనకండి. నాసిరకం వైర్లు, గ్లాస్ వాడటం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి.
Also Read: వాట్సాప్ హ్యాకర్ల కొత్త స్కెచ్.. మీ చాట్స్ సేఫ్‌గా ఉండాలంటే వెంటనే ఈ 5 సెట్టింగ్స్ మార్చండి!
మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఫస్ట్ చూసేది రేటు. కానీ ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో మాత్రం భద్రతను చూడాలి. మీరు కొనే ఇండక్షన్ స్టవ్‌పై BIS లేదా ISI మార్క్ ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేయండి. ఈ గుర్తు ఉందంటే అది అన్ని రకాల సేఫ్టీ టెస్టులు పాస్ అయిందని అర్థం. ISI మార్క్ లేని వాటిలో లోపలి విడిభాగాలు చాలా నాసిరకంగా ఉంటాయి. కరెంటు వోల్టేజ్ కొంచెం పెరిగినా లేదా ఎక్కువ సేపు వాడినా అవి వేడిని తట్టుకోలేక ఇలాగే పేలిపోతాయి.
మనం రోజువారీ వంటల కోసం వాడే స్టవ్ కనీసం 1800 నుండి 2100 వాట్స్ ఉండేలా చూసుకోవాలి. తక్కువ వాటేజ్ ఉన్న స్టవ్‌ను కొని దానిపై ఎక్కువ సేపు వంట చేస్తే, అది లోపల విపరీతంగా వేడెక్కి మెషీన్ పాడైపోతుంది. అంతేకాదు.. మన ఊర్లలో కరెంటు అప్పుడప్పుడు హెచ్చుతగ్గులకు గురవుతుంటుంది. అందుకే వోల్టేజ్ ప్రొటెక్షన్ ఉన్న స్టవ్‌లను ఎంచుకుంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఉండదు.
చాలామంది చేసే పొరపాటు ఏంటంటే.. వంట అయిపోగానే వెంటనే ప్లగ్ తీసేస్తారు. కానీ ఇండక్షన్ స్టవ్ కింద ఒక చిన్న ఫ్యాన్ ఉంటుంది. అది లోపల ఉన్న వేడిని బయటకు పంపిస్తుంది. వంట పూర్తయ్యాక కూడా ఆ ఫ్యాన్ కాసేపు తిరుగుతుంది. ఆ ఫ్యాన్ ఆగిపోయే వరకు స్విచ్ ఆపకూడదు. అలా చేస్తేనే లోపలి మెషీన్ చల్లబడుతుంది. అలాగే స్టవ్ పైన ఉండే గ్లాస్ టఫ్డ్ గ్లాస్ అయ్యుండాలి. లేదంటే చిన్నపాటి వేడికే అది పగిలిపోయే ప్రమాదం ఉంది.
మార్కెట్లో వెయ్యి రూపాయల లోపు కూడా ఇండక్షన్ స్టవ్‌లు దొరుకుతుంటాయి. కానీ వాటికి సరైన గ్యారంటీ ఉండదు. పాడైతే బాగు చేసే దిక్కు ఉండదు. ప్రెస్టీజ్, ఫిలిప్స్, బజాజ్, హావెల్స్ వంటి మంచి బ్రాండెడ్ కంపెనీలవి కొంటేనే మనకు భద్రత. కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే.. ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా! నమ్మకమైన షాపుల్లో లేదంటే బాగా పేరున్న ఆన్‌లైన్ సైట్లలో మాత్రమే ఇలాంటివి కొనండి. ఏది ఏమైనా కిచెన్‌లో వంట చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండటం మన బాధ్యత.
Also Read: బ్యాటరీతో పనిచేసే స్మార్ట్ ప్రొజెక్టర్.. కరెంట్ లేని చోట కూడా సినిమాలు చూసేయొచ్చు!