Inverter vs normal washing machine: ఇంటి పనులను ఈజీ చేసే గాడ్జెట్స్‌లో వాషింగ్ మెషిన్ చాలా ముఖ్యం. అయితే.. ఈ కొత్త వాషింగ్ మెషిన్ కొనాలని మార్కెట్లోకి వెళ్తే.. “సార్, ఇన్వర్టర్ మోడల్ తీసుకోండి. కరెంట్ బిల్ తక్కువొస్తుంది” అని షాప్ వాళ్లు చెప్తుంటారు. మరోవైపు నార్మల్ మెషిన్లు కాస్త తక్కువ ధరకే దొరుకుతుంటాయి. దాంతో అసలు ఈ ఇన్వర్టర్ వాషింగ్ మెషిన్ అంటే ఏంటి? దీని వల్ల నిజంగానే కరెంట్ బిల్లులు తగ్గుతాయా? మన ఇండియన్ హోమ్స్, కరెంట్ ఖర్చు తగ్గుదలకు ఏది బెస్ట్? అనే కన్ఫ్యూజన్ అందరిలోనూ ఉంటుంది. ఈ డౌట్స్ అన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ.. ఏది బెటరో ఈజీగా తేల్చేద్దాం..
అసలు ఇన్వర్టర్ వాషింగ్ మెషిన్ అంటే ఏంటి?
చాలా మంది ఇన్వర్టర్ వాషింగ్ మెషిన్ అంటే కరెంట్ పోయినప్పుడు ఇంట్లో ఉండే ఇన్వర్టర్ (బ్యాటరీ) మీద నడుస్తుందని అనుకుంటారు. కానీ అది తప్పు. ఇన్వర్టర్ టెక్నాలజీ అనేది మెషిన్ లోపల ఉండే మోటార్ పనిచేసే విధానానికి సంబంధించింది.
నార్మల్ వాషింగ్ మెషిన్: ఇందులో మోటార్ ఎప్పుడూ ఒకే స్పీడ్‌తో తిరుగుతుంది. బట్టల బరువు 1 కేజీ ఉన్నా, 5 కేజీలు ఉన్నా అది ఒకే లెవెల్ శక్తిని వాడుకుంటుంది. పని కాగానే సడన్‌గా ఆగిపోతుంది. మళ్లీ స్టార్ట్ అవుతుంది. దీని వల్ల కరెంట్ ఎక్కువ కాలుతుంది.
ఇన్వర్టర్ వాషింగ్ మెషిన్: ఇందులో ‘సెన్సార్లు’ ఉంటాయి. ఇవి మీరు వేసిన బట్టల బరువును బట్టి మోటార్ స్పీడ్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తాయి. బట్టలు తక్కువ ఉంటే తక్కువ స్పీడ్, ఎక్కువ ఉంటే ఎక్కువ స్పీడ్‌తో తిరుగుతాయి.
ఇన్వర్టర్ vs నార్మల్: ఐదు ముఖ్యమైన తేడాలు:
మన ఇండియన్ ఇళ్లలో వాషింగ్ మెషిన్ల వాడకాన్ని బట్టి ఈ రెండింటి మధ్య తేడాలు ఎలా ఉంటాయో చూద్దాం.
1. పవర్ సేవింగ్ (కరెంట్ బిల్లులు):
ఇన్వర్టర్ వాషింగ్ మెషిన్లు దాదాపు 30% నుంచి 40% వరకు కరెంట్ ఆదా చేస్తాయి. నార్మల్ మెషిన్లతో పోలిస్తే ఇవి చాలా తక్కువ కరెంట్ ఖర్చు చేస్తాయి. మీ ఇంట్లో రోజూ వాషింగ్ మెషిన్ వాడే అలవాటు ఉంటే.. ఇన్వర్టర్ మోడల్ వల్ల నెలవారీ కరెంట్ బిల్లులో స్పష్టమైన తేడా కనిపిస్తుంది.
2. శబ్దం, వైబ్రేషన్:
నార్మల్ వాషింగ్ మెషిన్లు బట్టలు ఉతికేటప్పుడు, ముఖ్యంగా డ్రైయర్ అయ్యేటప్పుడు విపరీతమైన శబ్దం చేస్తూ.. ఇల్లంతా అదిరిపోయేలా వైబ్రేట్ అవుతాయి. కానీ, ఇన్వర్టర్ మెషిన్లలో ‘బ్రష్‌లెస్ డైరెక్ట్ డ్రైవ్’ (BLDC) మోటార్లు వాడటం వల్ల ఇవి చాలా సైలెంట్‌గా, స్మూత్‌గా పని చేస్తాయి.
3. బట్టల లైఫ్ :
నార్మల్ మెషిన్ మోటార్ ఒకే స్పీడ్‌తో తిరగడం వల్ల బట్టలు ఒకదానికొకటి గట్టిగా రాపిడికి గురై త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంది. అదే ఇన్వర్టర్ మెషిన్ అయితే.. బట్టల లోడ్‌ను బట్టి స్మార్ట్‌గా తిరగడం వల్ల బట్టల క్వాలిటీ దెబ్బతినకుండా ఎక్కువ రోజులు కొత్తవిలా ఉంటాయి.
4. ధర :
ధర విషయంలో నార్మల్ వాషింగ్ మెషిన్లదే పైచేయి. ఇవి ఇన్వర్టర్ మోడల్స్ కంటే రూ. 3,000 నుంచి రూ. 6,000 వరకు తక్కువ ధరకే వచ్చేస్తాయి. ఇన్వర్టర్ టెక్నాలజీ అడ్వాన్స్‌డ్ కాబట్టి దీని ప్రారంభ ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది.
5. లైఫ్ టైమ్, వారంటీ :
ఇన్వర్టర్ మోటార్లపై లోడ్ తక్కువగా పడటం వల్ల ఇవి చాలా కాలం మన్నిక వస్తాయి. అందుకే కంపెనీలు కూడా ఇన్వర్టర్ మోటార్లపై ఏకంగా 10 సంవత్సరాల వరకు వారంటీ ఇస్తున్నాయి. నార్మల్ మెషిన్ల మోటార్ల లైఫ్ దీనికంటే తక్కువగా ఉంటుంది.
Also Read: ఇంట్లోనే జిమ్ వర్కవుట్! బెస్ట్ ఎక్సర్‌సైజ్ బైక్స్ ఇవే..
ఇండియన్ హోమ్స్‌కి ఏది బెటర్?
ప్రస్తుత ట్రెండ్ ,మన ఇండియన్ ఫ్యామిలీస్ అవసరాల ప్రకారం చూస్తే..
మీరు ఇన్వర్టర్ మెషిన్ ఎంచుకోవాలి.. ఒకవేళ: మీ ఇంట్లో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉండి, రోజూ మెషిన్ వాడాల్సి వస్తే ఇన్వర్టర్ బెస్ట్. అలాగే హాస్పిటాలిటీ, అపార్ట్‌మెంట్ లైఫ్‌లో సైలెంట్‌గా పని ముగిసిపోవాలనుకున్నా, లాంగ్ టర్మ్‌లో కరెంట్ బిల్స్ ఆదా అవ్వాలనుకున్నా కొంచెం బడ్జెట్ పెంచి ఇన్వర్టర్ మోడల్ తీసుకోవడమే స్మార్ట్ డెసిషన్.
మీరు నార్మల్ మెషిన్ ఎంచుకోవాలి.. ఒకవేళ: మీది చిన్న ఫ్యామిలీ లేదా బ్యాచిలర్స్ అయి ఉండి, వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే మెషిన్ వాడతాము అనుకుంటే నార్మల్ మెషిన్ సరిపోతుంది. అలాగే ప్రస్తుతం బడ్జెట్ చాలా తక్కువగా ఉండి, ఎక్కువ ఖర్చు పెట్టలేము అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
మొదట్లో పెట్టే పెట్టుబడి కాస్త ఎక్కువైనా.. లాంగ్ రన్‌లో చూసుకుంటే ఇన్వర్టర్ వాషింగ్ మెషిన్ మన డబ్బులను, కరెంట్‌ను, బట్టలను కూడా సేవ్ చేస్తుంది.మోడరన్ హోమ్స్ అన్నీ స్మార్ట్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్న తరుణంలో.. ఇన్వర్టర్ వాషింగ్ మెషిన్ కొనడమే వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. మీ అవసరాలు, బడ్జెట్‌ను బట్టి సరైన నిర్ణయం తీసుకోండి.