Anant Ambani Vantara Watch: డబ్బుతో విలాసాలను ఎవరైనా కొంటారు. కానీ, తనకిష్టమైన పనిని ప్రపంచం మెచ్చేలా చేయడం మాత్రం కొంతమందికే సాధ్యం అవుతుంది. అనంత్ అంబానీ అంటే కేవలం ముకేష్ అంబానీ కొడుకుగా, వ్యాపారవేత్త గానే కాదు.. మూగజీవాల కోసం ‘వంతారా’ను సృష్టించిన గొప్ప ప్రకృతి ప్రేమికుడిగానూ మనందరికీ తెలుసు.
అనంత్ అంబానీకి జంతువులన్నా, ప్రకృతి అన్నా ఎంత ఇష్టమో.. ఆయన కలల వంతారా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇప్పుడా వన్యప్రాణి సామ్రాజ్యాన్ని తన మణికట్టుపై ధరించబోతున్నారు. ప్రముఖ లగ్జరీ వాచ్ బ్రాండ్ Jacob & Co అనంత్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ వాచ్ కేవలం టైం కోసమే కాదు.. మూగజీవాల పట్ల ఆయనకున్న అంకితభావాన్ని తెలుపుతుంది. రత్నాల కాంతులతో మెరిసిపోతున్న ఈ అరుదైన వంతారా వాచ్ విలువ అక్షరాలా రూ.12 కోట్లు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూసేద్దాం..
Also Read: వందేళ్లకు ఒక్కసారే.. 6 నిమిషాలు సూర్యుడు మాయం, పట్టపగలు చీకటి.. ఎప్పుడంటే?
ఈ వాచ్‌ను చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. దీని డయల్ మధ్యలో అనంత్ అంబానీ బొమ్మను ఎంతో చక్కగా, చేతితో పెయింట్ చేసి అమర్చారు. ఇది ప్రకృతి పట్ల ఆయనకు ఉన్న బాధ్యతను తెలియజేస్తుంది. అనంత్‌కు ఇరువైపులా సింహం, బెంగాల్ టైగర్ బొమ్మలను ఎంతో సహజంగా తీర్చిదిద్దారు. వంతారా కేంద్రంలో సంరక్షించబడుతున్న వన్యప్రాణులకు ఇవి ప్రతిరూపాలన్నమాట.
ఈ వాచ్ డిజైన్ మొత్తం అడవిని తలపించేలా గ్రీన్ కలర్ థీమ్‌తో ఉంటుంది. దీని ఫ్రేమ్ తయారీలో వాడిన రత్నాలు సామాన్యమైనవి కావు. డిమాంటోయిడ్ గార్నెట్స్, సావోరైట్స్, గ్రీన్ సఫైర్లు, తళతళలాడే వైట్ డైమండ్లను దీనిలో వాడారు. మొత్తం మీద 21.98 క్యారెట్ల బరువున్న 397 అమూల్యమైన రత్నాలతో ఈ వాచ్‌ను అలంకరించారు. అంటే.. ఇది ఒక వాచ్ లాగా మాత్రమే కాకుండా.. విలువైన ఆభరణంలా మెరిసిపోతుంది.
నిజానికి వంతారా అంటే.. అడవికి నక్షత్రం అని అర్థం. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 3,000 ఎకరాల్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది దాదాపు 2,000 రకాలకు చెందిన 1.5 లక్షలకు పైగా జంతువులకు ఆశ్రయం ఇస్తోంది. ఏనుగుల కోసం ప్రత్యేక ఆసుపత్రులు, ఎంఆర్ఐ స్కాన్లు, హైడ్రోథెరపీ పూల్స్ వంటి అత్యాధునిక సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. 2025 మార్చిలో ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించినప్పటి నుండి.. ఈ వన్యప్రాణుల స్వర్గధామం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది.
అనంత్ అంబానీకి లగ్జరీ వాచీలంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర ఇప్పటికే పాటెక్ ఫిలిప్, ఆడెమర్స్ పిగ్యుట్, రిచర్డ్ మిల్, రోలెక్స్ వంటి బ్రాండ్లకు చెందిన అరుదైన వాచీలు ఉన్నాయి. ఆయన వాచ్ కలెక్షన్ విలువ దాదాపు రూ.200 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఇప్పుడు ఈ వంతారా వాచ్ ఆయన కలెక్షన్‌లో మరో మకుటంగా చేరిపోయింది.
Also Read: ఏఐ కోసం చేతులు కలిపిన యాపిల్, గూగుల్.. గుత్తాదిపత్యమేనని ఎలాన్ మస్క్ ఆందోళన!