Jio Recharge: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఇటీవల రూ. 500, రూ. 550 ధరకు రెండు వేర్వేరు ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.50 తేడాతో వచ్చిన ఈ ప్లాన్లలో బెనిఫిట్స్ పరంగా స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా ప్లాన్ల వివరాలు, దేని వల్ల యూజర్లకు ఎక్కువ ప్రయోజనం కలుగనుందో ఈ కథనంలో చూద్దాం.
జియో తన రూ.500 ప్రీపెయిడ్ ప్లాన్ ను 28 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ఇందులో రోజుకు 2GB డేటా (మొత్తం 56GB), అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. అర్హత ఉన్న వినియోగదారులకు అపరిమిత 5G డేటా కూడా అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ప్లాన్ ను ప్రధానంగా ఓటీటీ (OTT) ప్రయోజనాలను ఉద్దేశించి జియో తీసుకొచ్చింది. జియో టీవీ యాప్ ద్వారా యూట్యూబ్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ లివ్, జీ5, సన్ నెక్స్ట్, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ+ మొదలైన అనేక ఓటీటీలను ఫ్రీగా చూడొచ్చు. హాట్ స్టార్ సైతం ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. అంతేకాకుండా రూ. 35,100 విలువైన ‘గూగుల్ ఏఐ ప్రో’ 18 నెలల సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా రావడం ఈ ప్లాన్ ప్రత్యేకత.
రూ. 550 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో 90GB డేటాను అందిస్తుంది. అయితే ఇది ప్లాన్ వ్యాలిడిటీ మాత్రమే. సర్వీస్ వ్యాలిడిటీ కాదు. డేటా వోచర్ (Data Voucher)లా ఇది పనిచేయనుంది. దీనిని ఉపయోగించాలంటే యూజర్ వద్ద ముందే ఏదైనా యాక్టివ్ సర్వీస్ ప్లాన్ ఉండటం తప్పనిసరి. సాధారణంగా 3 నెలలు లేదా ఏడాది వ్యాలిడిటీ ఉన్న రీఛార్జ్ చేసుకున్న వారికి ఇది ఉపయోగపడనుంది. ఇక ఈ ప్లాన్‌లో వాయిస్ కాల్స్, SMS లు వంటి సదుపాయాలు లేవు. కానీ ఇందులో కూడా యూట్యూబ్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ లైట్, సోనీ లివ్, జీ5 తదితర ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు.. 1000కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్ వీక్షించే అవకాశం ఉంటుంది.
Also Read: కరెంట్ కష్టాలకు చెక్.. తెలంగాణకే 90 శాతం బొగ్గు.. సింగరేణి బంపరాఫర్!
రెండు ప్లాన్లు వేర్వేరు అవసరాల కోసం ఉద్దేశించినవి అయినప్పటికీ ‘వాల్యూ ఫర్ మనీ’ కోణంలో రూ. 500 ప్లాన్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఉచితంగా లభించే రూ. 35,100 విలువైన ‘Google AI Pro’ సబ్‌స్క్రిప్షన్, అపరిమిత 5G డేటా వల్ల ఈ ప్లాన్ వినియోగదారులకు మెరుగైన ప్రయోజనాన్ని ఇస్తోంది.
Also Read: ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల తేదీ లాక్.. రిలీజ్ ఎప్పుడంటే..?