Samsung Galaxy S26 Sales: శాంసంగ్ కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన Galaxy S26 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో దూసుకుపోతున్నాయి. మునుపటి Galaxy S25 మోడళ్లతో పోలిస్తే.. ఈ కొత్త ఫోన్ల విక్రయాలు ఊహించిన దానికంటే చాలా మెరుగ్గా ఉన్నాయని ప్రముఖ రీసెర్చ్ సంస్థ ‘కౌంటర్ పాయింట్’ తమ నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా ఫోన్ లాంచ్ అయిన మొదటి ఆరు వారాల్లో Galaxy S26, S26 Plus, S26 Ultra మోడళ్లకు కస్టమర్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే.. ఆరో వారం తర్వాత అమ్మకాల వేగం కాస్త తగ్గినట్లు తెలుస్తోంది.
కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. Galaxy S25 సిరీస్‌తో పోలిస్తే కొత్త S26 సిరీస్ గ్లోబల్ అమ్మకాలు ఏకంగా 15 శాతం పెరిగాయి. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల పుణ్యమా అని శాంసంగ్ ఓవరాల్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు కూడా 5 శాతం మేర వృద్ధి చెందాయి. చైనా మొబైల్ కంపెనీలు మార్కెట్లో పోటీ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో.. శాంసంగ్ ఈ స్థాయిలో పుంజుకోవడం విశేషం.
Also Read: శాంసంగ్ ట్యాబులు, ఫోల్డబుల్ ఫోన్లలో జీమెయిల్ కొత్త బగ్.. రంగంలోకి గూగుల్, ఇలా ఫిక్స్ చేసుకోండి!
ఈ కొత్త ఫోన్ల డిమాండ్ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంది. అమెరికా, సౌత్ కొరియా లాంటి ప్రీమియం మార్కెట్లలో కొనుగోలుదారులు ఈ ఫోన్లను కొనేందుకు బాగా ఆసక్తి చూపించారు. అక్కడి మొబైల్ క్యారియర్ ఆఫర్లు, ఫోన్లలోని సరికొత్త AI ఫీచర్లు కస్టమర్లను బాగా ఆకట్టుకున్నాయి. అయితే, చైనా, జపాన్ దేశాల్లో మాత్రం గతేడాదితో పోలిస్తే ఈసారి ఆశించిన స్థాయిలో డిమాండ్ కనిపించలేదు.
మరోవైపు ఐరోపా (యూరప్) మార్కెట్లో Galaxy S26 Ultra మోడల్‌కు విపరీతమైన క్రేజ్ లభించింది. ముఖ్యంగా గతేడాది అల్ట్రా మోడల్ ధరతో పోలిస్తే ఈసారి ధర పెంచకపోవడం, అలాగే ప్రైవసీని మరింత పెంచేలా తీసుకొచ్చిన సరికొత్త ‘ప్రైవసీ డిస్‌ప్లే’ ఫీచర్ అక్కడి యూజర్లను బాగా ఆకర్షించాయి. కాకపోతే.. ప్రస్తుతం పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల రాబోయే రోజుల్లో కొనుగోళ్లు కాస్త తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మనదేశంలో కూడా ఈ సిరీస్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. భారత్‌లో బేస్ మోడల్ అయిన Galaxy S26 ధర రూ.87,999 నుండి ప్రారంభం అవుతుండగా.. Galaxy S26 Plus ధర రూ.1,19,999గా ఉంది. ఇక అన్నింటికంటే హైఎండ్ మోడల్ అయిన Galaxy S26 Ultra ధర రూ.1,39,999గా నిర్ణయించారు. ప్రారంభంలో మంచి సేల్స్ సాధించిన ఈ సిరీస్.. రానున్న రోజుల్లో ఇదే వేగాన్ని ఎలా కొనసాగిస్తుందో చూడాలి.
Also Read: రూ.15వేల బడ్జెట్‌లో 7,000mAh బ్యాటరీ ఫోన్.. దుమ్మురేపుతున్న Moto G37 Power!