Online Ads Everywhere| మీరు ఎప్పుడైనా గమనించారా? ఏదైనా వస్తువు గురించి ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసిన తర్వాత, అదే వస్తువు యాడ్స్ ప్రతిచోటా కనిపిస్తాయి. ఉదాహరణకు, ఒకరోజు మీరు మంచి డ్రెస్ లేదా షూస్ కోసం సెర్చ్ చేశారు. ఆ వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రోల్ చేస్తున్నా.. యూట్యూబ్ లో వీడియో చూస్తున్నా.. ఏదైనా వెబ్ సైట్ లో పేజీ ఓపెన్ చేసినా మధ్యలో అకస్మాత్తుగా గూగుల్ యాడ్స్ వచ్చేస్తాయి. ఆ యాడ్స్ అన్నీ మీరు సెర్చ్ చేసిన షూస్ లేదా డ్రెస్ ల గురించే ఉంటాయి. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. కావాలనే పక్కా ప్లానింగ్ తో మిమ్మల్ని మానసికంగా టార్గెట్ చేసే డిజిటల్ మార్కెటింగ్ వ్యూహం. కంపెనీలన్నీ అధునాతన టెక్నాలజీ ఉపయోగించి మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాయి.
మార్కెటింగ్ నిపుణులు.. రంగురంగులు, ఆకర్షణీయమైన ప్రకటనలు తయారు చేస్తారు. మీరు కొనాలని ఆలోచించిన వస్తువును మళ్లీ మళ్లీ మీ కళ్ల ముందు యాడ్స్ రూపంలో తీసుకొచ్చి గుర్తు చేస్తారు. ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో మీ ఫీడ్‌లో ఈ ప్రకటనలు వరుసగా కనిపిస్తాయి. దీనివల్ల మీ మనసులో ఆ వస్తువు అవసరమనే భావన కలుగుతుంది. ఈ యాడ్స్ లక్ష్యం ఒక్కటే.. మిమ్మల్ని కొనుగోలు చేసేందుకు ఒప్పించడం.
మీరు బ్రౌజింగ్ చేసే సమయంలో వెబ్ బ్రౌజర్ లో ఉండే కుకీస్ ద్వారా మీ సెర్చింగ్ సమాచారాన్ని సేకరిస్తారు. కుకీస్ అంటే బ్రౌజర్‌లో నిల్వ చేసే చిన్న డేటా ఫైల్స్. మీరు ఏ వెబ్‌సైట్ ఓపెన్ చేసి అక్కడ ఎంత సేపు, ఏం చెక్ చేశారు. గూగుల్, య్యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అది ఏదైనా సరే అందులో కుకీస్ ఫైల్స్ ఉంటాయి. మీ సెర్చ్ హిస్టరీ, మీరు ఏ విషయంలో ఆసక్తి చూపారు.. ఆ సమాచారమంతా కుకీస్ ఫైల్స్ లో స్టోర్ అయి ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ సమాచారాన్ని తీసుకుని, ఆ వెంటనే సంబంధిత ప్రకటనలు చూపిస్తారు. అందుకే మీకు అదే వస్తువుల యాడ్స్ ప్రతిచోట కనిపిస్తాయి.
గూగుల్, మెటా వంటి పెద్ద ప్లాట్‌ఫామ్‌లు తమ డేటాను మరొక కంపెనీతో షేర్ చేసుకుంటాయి. ఇదంతా ఒక పెద్ద డిజిటల్ యాడ్ నెట్‌వర్క్ లాగా పనిచేస్తాయి. గూగుల్‌లో సెర్చ్ చేసిన డేటా, ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ కోసం సహాయపడుతుంది. వివిధ యాప్‌ల మధ్య మీ ఆన్‌లైన్ యాక్టివిటీ కనెక్ట్ అవుతుంది. మీరు వెబ్ లో ఏం చూసినా, ఏం వెతికినా, ఎలాంటి వీడియోలు చూస్తున్నా.. అదంతా కంపెనీలకు డేటా అందుతూ ఉంటుంది. అందుకే మీరు యూట్యూబ్ లో ఒక కెటగిరీ వీడియోలు చూస్తే.. అలాంటి వీడియోలే ఆ తరువాత నుంచి ఎక్కువగా పక్కన కనిపిస్తాయి.
చాలా యాప్‌లు పరోక్షంగా ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతాయి. మీ ప్రాధాన్యతలు, బ్రౌజింగ్ ప్యాటర్న్‌లు ట్రాక్ చేస్తాయి. మీ ఖర్చు సామర్థ్యం కూడా అంచనా వేస్తాయి. అల్గారిథమ్‌లు ఈ డేటాను నిరంతరం విశ్లేషిస్తాయి. ఏ వస్తువులు మీకు నచ్చుతాయో అంచనా వేస్తాయి.
కంపెనీలు మీ గురించి వివరంగా ప్రొఫైల్ తయారు చేస్తాయి. మీ వయసు, లొకేషన్, హాబీలు ఇందులో ఉంటాయి. మీ క్లిక్‌లు, సెర్చ్‌లు ఈ ప్రొఫైల్‌ను మరింత ఖచ్చితం చేస్తాయి. ఈ ప్రొఫైల్ ఆధారంగానే మీకు యాడ్స్ చూపిస్తారు.
మొత్తం వ్యవస్థ మిమ్మల్ని సూక్ష్మంగా ప్రభావితం చేయడానికి రూపొందించారు. మళ్లీ మళ్లీ చూడటం వల్ల వస్తువు పరిచితమవుతుంది. పరిచయం నమ్మకాన్ని కలిగిస్తుంది. దీనివల్ల కొనుగోలు చేయడం సులభమవుతుంది. ఇదంతా మిమ్మల్ని మానసికంగా ఒప్పించేందుకు ఒక బలమైన ప్రక్రియ. దాదాపు యాడ్స్ చూసి కొనుగోలు చేసేస్తారు.
యాడ్స్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. దీని కోసం ట్రాకింగ్‌ని తగ్గించాలి. బ్రౌజర్ ప్రైవసీ సెట్టింగ్స్ మార్చవచ్చు. థర్డ్ పార్టీ కుకీస్ బ్లాక్ చేయండి. ప్రైవేట్ లేదా ఇన్‌కాగ్నిటో మోడ్ తరచూ ఉపయోగించండి. బ్రౌజర్ హిస్టరీ, కుకీస్ రెగ్యులర్‌గా క్లియర్ చేయండి. యాప్ సెట్టింగ్స్‌లో పర్సనలైజ్డ్ యాడ్స్ ఆప్ట్ అవుట్ చేయండి.
మీరు చేసే ప్రతి ఆన్‌లైన్ క్లిక్ ఇంటర్నెట్ లో ఒక డిజిటల్ గుర్తు వదిలివేస్తుంది. కంపెనీలు ఈ గుర్తులను సేకరించి ప్రొఫైల్ తయారు చేస్తాయి. అవగాహనే నియంత్రణకు మొదటి అడుగు. అన్నీ ఆపలేము, కానీ కృషి చేస్తే బాగా తగ్గించవచ్చు.
Also Read: సరదా కోసం బ్లూటూత్ ల్యాండ్‌లైన్ ఫోన్ తయారు చేసిన యువతి.. 3 రోజుల్లోనే రూ.1 కోటి సంపాదన
గుర్తుంచుకోండి, చాలా ఉచిత సేవలు ఈ మోడల్‌పైనే నడుస్తాయి. పైకి కనిపిస్తున్నట్లు మీరు యూట్యూబ్‌లో ఫ్రీగా వీడియోలు చూస్తారు. గూగుల్ మీకోసం ఉచితంగా సెర్చ్ చేస్తుంది. ఏఐ ద్వారా సమాధానం ఇస్తుంది. కానీ వారంతా యాడ్స్ కోసం వచ్చే ఆదాయంపైనే పరోక్షంతా ఆధారపడతాయి. గూగుల్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్‌లకు ఇదే ప్రధఆన ఆదాయం. మీరు ఉచితం అని భావిస్తారు కానీ దాని కోసం కొంత మీ ప్రైవేట్ డేటాని తీసుకుంటున్నారు. ఈ ట్రేడ్-ఆఫ్ అర్థం చేసుకుంటే, ఆన్‌లైన్‌లో మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు