Vivo X300 Ultra vs Samsung S26 Ultra: ప్రముఖ స్మార్ట్ ఫోన్ వివో.. ఫ్లాగ్ షిప్ సెగ్మెంట్ లో అత్యాధునిక ప్రీమియం మెుబైల్ ను తాజాగా భారత్ లో లాంచ్ చేసింది. ‘వివో X300 అల్ట్రా’ టాప్ నాచ్ ఫీచర్లతో మెుబైల్ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తోంది. తద్వారా అగ్రశ్రేణి ఫ్లాగ్ షిప్ మోడల్స్ అయిన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా, పిక్సెల్ 10 ప్రో ఎక్ఎల్ కు గట్టిపోటీ ఇస్తోంది. అయితే వివో X300 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఇంచుమించు ఒకే ధరకు అందుబాటులో ఉండటంతో ఈ రెండు ఫోన్ల మధ్య మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫీచర్ల పరంగా రెండింటికి ఉన్న వ్యత్యాసం, ధర వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రాలో 6.8 అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లే ఉంది. ఇది దాదాపు 3000 నిట్స్ అత్యధిక బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ ప్రొటెక్షన్ తో లభిస్తోంది. మరోవైపు వివో X300 అల్ట్రా కూడా 6.78 అంగుళాల LTPO అమోల్డ్ స్క్రీన్‌తో రూపొందింది. ఇది 2K రిజల్యూషన్, కర్వ్డ్ ఎడ్జెస్ తో చూడటానికి స్టైలిష్ గా కనిపిస్తుంది. అయితే డిస్ ప్లే క్వాలిటీ విషయంలో శాంసంగ్ కు మార్కెట్లో మంచి గుడ్ విల్ ఉంది. కాబట్టి ఈ రెండు ఫోన్లలో స్క్రీన్ పరంగా శాంసంగ్ పైచేయి సాధిస్తోందని నిపుణులు అంటున్నారు.
మెుబైల్స్ పనితీరు విషయానికి వస్తే శాంసంగ్ S26 అల్ట్రాలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 (Snapdragon 8 Gen 5) చిప్‌సెట్ అమర్చారు. ప్రస్తుతం ఇది అత్యంత వేగవంతమైన ప్రాసెసర్ గా మార్కెట్లో ఉంది. మరోవైపు వివో X300 అల్ట్రాలో కూడా అంతే స్పీడ్ కలిగిన మీడియాటెక్ డైమెన్సిటీ 9500 అక్టా కోర్ ప్రాసెసర్ ను ఫిక్స్ చేశారు. కాబట్టి గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం ఈ రెండు ఫోన్లు బెస్ట్ ఛాయిస్ గా నిలవనున్నాయి.
వివో X300 అల్ట్రా బ్యాటరీ విషయంలో శాంసంగ్ ను వెనక్కి నెట్టిందని చెప్పవచ్చు. ఇందులో 6600mAh బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను అందించారు. ఫలితంగా ఫోన్ జెట్ వేగంతో ఛార్జ్ అవుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. మరోవైపు శాంసంగ్ S26 అల్ట్రా మాత్రం 5000mAh బ్యాటరీతో వచ్చింది. దీనికి 60W వైర్డ్, 40W వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ను ఇచ్చారు. అయితే బ్యాటరీ మేనేజ్ మెంట్ విషయంలో శాంసంగ్ కు మంచి గుడ్ విల్ ఉంది. కాబట్టి బ్యాటరీ విషయంలో రెండు ఫోన్లూ మంచి బ్యాకప్ ను అందిస్తాయని నిపుణులు అంటున్నారు.
వివో, శాంసంగ్ ఫోన్లు కెమెరా విభాగంలో చాలా పటిష్టంగా ఉన్నాయి. వివో X300 అల్ట్రా కెమెరా విషయంలో అద్భుతమైన పనితీరును కనబరచనుంది. ఇందులో 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌తో పాటు జీస్ (ZEISS) ఆప్టిక్స్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది రాత్రి వేళల్లో పోర్ట్రెయిట్ షాట్స్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. మరోవైపు శాంసంగ్ S26 అల్ట్రాలో 200MP మెయిన్ సెన్సార్‌తో పాటు మెరుగైన ‘స్పేస్ జూమ్’, AI ఇమేజ్ ప్రాసెసింగ్ ఫీచర్లు ఉన్నాయి. వీడియో రికార్డింగ్, స్టేబిలిటీ విషయంలో శామ్‌సంగ్ కొంచెం ముందుంటుందని నిపుణులు ెచబుతున్నారు.
శాంసంగ్ ఫోన్‌లో ఎస్ పెన్ (S-Pen) ఉండటం ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇది నోట్స్ రాసుకోవడానికి, డ్రాయింగ్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే శాంసంగ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ 7 ఏళ్ల వరకు లభిస్తాయి. వివోలో సాఫ్ట్‌వేర్ ఎక్స్ పీరియన్స్ బాగానే ఉన్నా.. శాంసంగ్ వన్ UI అంత మెరుగ్గా ఉండకపోవచ్చని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కానీ వివో డిజైన్, కెమెరా పనితనం, ఫాస్ట్ పర్ ఫార్మెన్స్ ప్రస్తుత రోజుల్లో యూజర్లను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషిస్తున్నారు.
Also Read: తమిళనాట రాజకీయాలు కొత్త మలుపు.. గవర్నర్‌తో విజయ్ మరోసారి భేటీ, ప్రభుత్వం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
వివో X300 అల్ట్రా మెుబైల్.. శాంసంగ్ కంటే ఎక్కువ ధరకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం రూ.1,59,999కి ఇది సేల్ అవుతోంది. అదే సమయంలో, శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా మాత్రం.. రూ.1,39,999కే లభిస్తోంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో కొద్దిగా హెచ్చతగ్గులు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. బ్రాండ్ ఇమేజ్, నాణ్యమైన డిస్ ప్లే, ఎక్కువగా సాఫ్ట్ వేర్ అప్డేట్స్ కోరుకునేవారు.. శాంసంగ్ ట్రై చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో దీని ధర వివోతో పోలిస్తే తక్కువగా ఉండటాన్ని హైలెట్ చేస్తున్నారు. అలా కాకుండే లేటెస్ట్ ట్రెండ్, ఫాస్ట్ పర్ ఫార్మెన్స్, భారీ బ్యాటరీ వంటి ముఖ్యం అని భావిస్తే.. వివో X300 అల్ట్రా బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Also Read: విజయ్ చిన్ననాటి క్లాస్ రూమ్ ఫోటో వైరల్.. ఆయనను మీరు గుర్తుపట్టారా?