Induction safety guidelines: ప్రస్తుతం ఎల్‌పీజీ గ్యాస్ కొరత వల్ల చాలా మంది ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ వీటిని ఎవరు వాడకూడదనే అవగాహన చాలా మందికి లేదు. ఇంతకీ ఇండక్షన్ స్టవ్ వాడటం అందరికీ సేఫేనా? ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, పేస్‌మేకర్లు అమర్చుకున్న వారు దీనిని వాడొచ్చా? ఇండక్షన్ కుక్‌టాప్ వాడేటప్పుడు పాటించాల్సిన సేఫ్టీ టిప్స్ ఏంటి ? ఎవరు దీనికి దూరంగా ఉండాలనే విషయాలకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండక్షన్ స్టవ్.. ఎవరు వాడకూడదు?
ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో.. మధ్యతరగతి కుటుంబాలకు ఇండక్షన్ స్టవ్ ఒక వరంగా మారింది. ఇది విద్యుత్ శక్తిని అయస్కాంత క్షేత్రంగా మార్చి, పాత్రను నేరుగా వేడి చేస్తుంది. అయితే.. ఇది అందరికీ ఉపయోగకరం కాదు.
1. పేస్‌మేకర్ ఉన్నవారు జాగ్రత్త:
ఇండక్షన్ స్టవ్‌లు పనిచేసేటప్పుడు శక్తివంతమైన విద్యుదయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తాయి. గుండె సమస్యలతో పేస్‌మేకర్ లేదా డిఫిబ్రిలేటర్ వంటివి శరీరంలో ఉన్న వారు ఇండక్షన్ స్టవ్‌కు కనీసం 2 అడుగుల దూరం ఉండాలి. ఈ అయస్కాంత కిరణాలు పేస్‌మేకర్ పనితీరుకు ఇబ్బంది కలిగించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
2. వాచ్‌లు:
ఇండక్షన్ స్టవ్ దగ్గర పనిచేసేటప్పుడు చేతులకు మెటల్ వాచీలు, పెద్ద ఉంగరాలు లేదా లోహంతో తయారు చేసిన గాజులు ఉంటే అవి వేడెక్కే అవకాశం ఉంది. అయస్కాంత క్షేత్రం ప్రభావంతో ఇవి చర్మానికి గాయాలు కలిగించవచ్చు. కాబట్టి.. స్టవ్ ఆన్ చేయకముందే వీటిని తొలగించడం బెస్ట్.
3. గర్భిణీలు:
గర్భిణీలు ఇండక్షన్ స్టవ్‌ను వాడకూడదని ఖచ్చితమైన నిబంధన లేనప్పటికీ.. ఎక్కువ సమయం ఇండక్షన్ రేడియేషన్‌కు అతి దగ్గరగా ఉండటం మంచిది కాదని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. వంట చేసేటప్పుడు స్టవ్‌కు , శరీరానికి మధ్య తగినంత దూరం పాటించడం ముఖ్యం.
4. తప్పుడు పాత్రలు:
ఇండక్షన్ స్టవ్‌పై కేవలం ఐరన్ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ వంటి పాత్రలు మాత్రమే వాడాలి. అల్యూమినియం, రాగి లేదా గాజు పాత్రలు వాడటం వల్ల స్టవ్ పాడయ్యే అవకాశం ఉంది. అలాగే.. పాత్ర అడుగు భాగం ఫ్లాట్‌గా (సమతలంగా) ఉండాలి.
Also Read: బడ్జెట్ ధరలో ‘డిష్‌వాషర్’ కొనాలనుకుంటున్నారా? మీ వంటింటికి ఇవే పర్ఫెక్ట్!
ఇండక్షన్ స్టవ్ వాడేటప్పుడు పాటించాల్సిన నియమాలు:
గాలి వెలుతురు: ఇండక్షన్ స్టవ్‌లో అంతర్గత కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది. స్టవ్ కింద లేదా వెనక భాగంలో గాలి ఆడేలా ఖాళీ ఉంచాలి. క్లోజ్డ్ క్యాబినెట్లలో దీనిని వాడటం వల్ల వేడి పెరిగి సర్క్యూట్ కాలిపోవచ్చు.
నీటి నుంచి రక్షణ: స్టవ్ పైభాగం సెరామిక్ లేదా గ్లాస్‌తో తయారవుతుంది. వంట చేసేటప్పుడు నీరు చిమ్మితే వెంటనే తూడ్చివేయాలి. బటన్ల ప్యానెల్‌లోకి నీరు వెళ్తే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది.
ఖాళీ పాత్రలను వేడి చేయకండి: ఇండక్షన్ స్టవ్ చాలా వేగంగా వేడెక్కుతుంది. ఖాళీ పాత్రను ఉంచి ఎక్కువ పవర్‌లో పెడితే పాత్ర అడుగు భాగం కాలిపోవడమే కాకుండా స్టవ్ గ్లాస్ పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది.
చిన్నపిల్లలకు దూరం: స్టవ్ ఆపిన తర్వాత కూడా గ్లాస్ ప్యానెల్ వేడిగా ఉంటుంది. పిల్లలు పొరపాటున తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.