Rolex watches: లగ్జరీ వాచ్‌లలోనే ప్రపంచంలో ‘రోలెక్స్’ ఒక రారాజు. ఒకప్పుడు సాధారణ చేతి గడియారంగా మొదలై, నేడు ప్రపంచ వ్యాప్తంగా విజయానికి చిహ్నంగా మారింది. కేవలం సమయం చూడటానికి ఫోన్ ఉన్నా.. లక్షలు పోసి రోలెక్స్ ఎందుకు కొంటారనేది చాలా మంది సందేహం. ఈ వాచీల తయారీలో వాడే అత్యున్నత శ్రేణి స్టీల్, బంగారం, చేతితో చేసే సూక్ష్మమైన పనితనం, వాటికి మార్కెట్‌లో ఉన్న విపరీతమైన డిమాండ్ రోలెక్స్‌ను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్రాండ్‌గా నిలబెట్టాయి.
ప్రపంచంలో ఎన్నో వాచ్ కంపెనీలు ఉన్నా.. ‘రోలెక్స్’ పేరు వింటే వచ్చే గౌరవమే వేరు. రోలెక్స్ వాచ్‌ల ధరలు సాధారణంగా 5 లక్షల నుంచి ప్రారంభమై కోట్ల రూపాయల ఉంటాయి. అంత ఖరీదు పెట్టడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అత్యున్నత నాణ్యత కలిగిన లోహాలు:
చాలా లగ్జరీ వాచ్ కంపెనీలు ‘316L’ గ్రేడ్ స్టెయిన్ లెస్ స్టీల్ వాడుతుంటే.. రోలెక్స్ మాత్రం ‘904L’ స్టీల్‌ను ఉపయోగిస్తుంది. ఇది చాలా ఖరీదైనది. దీనిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఈ స్టీల్ తుప్పు పట్టదు, కాలం గడిచినా దీని మెరుపు తగ్గదు. అంతేకాకుండా.. రోలెక్స్ వాచీల్లో వాడే బంగారం, ప్లాటినం వంటి లోహాలను కంపెనీ సొంత ఫౌండ్రీలోనే తయారు చేసుకుంటుంది. దీని వల్ల వాటి నాణ్యతపై పూర్తి నియంత్రణ ఉంటుంది.
2. అద్భుతమైన పరిశోధన, అభివృద్ధి:
రోలెక్స్ కంపెనీకి స్విట్జర్లాండ్‌లో అత్యాధునిక పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో వాచ్ మోడల్ తయారీ వెనక వేల గంటల పరిశోధన ఉంటుంది. కందెన నూనెల నుంచి మూవ్‌మెంట్ లోపల ఉండే చిన్న స్ప్రింగ్‌ల వరకు ప్రతీదీ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు నిశితంగా పరిశీలిస్తారు. అందుకే ఈ వాచీలు అత్యంత కచ్చితమైన సమయాన్ని చూపిస్తాయి.
3. చేతితో చేసే పనితనం:
రోలెక్స్ వాచీలు పూర్తిగా మిషన్లతో తయారవ్వవు. వాచ్‌లోని ప్రతి చిన్న భాగాన్ని నైపుణ్యం కలిగిన నిపుణులు తమ చేతులతో అమరుస్తారు. ప్రతి వాచ్‌ను వందల రకాల నాణ్యత పరీక్షలకు గురి చేస్తారు. ఒక్కో రోలెక్స్ వాచ్ డిజైన్ నుంచి మార్కెట్లోకి రావడానికి దాదాపు ఒక సంవత్సరం సమయం పడుతుందంటే ఆశ్చర్యం కలగక మానదు.
4. పెరిగే రీసేల్ వాల్యూ :
చాలా వస్తువుల ధర కొన్న తర్వాత తగ్గిపోతుంది. కానీ రోలెక్స్ విషయంలో ఇది ఉల్టా! కొన్ని రోలెక్స్ మోడల్స్ (ఉదాహరణకు.. సబ్ మారినర్, డేటోనా) పాతవయ్యే కొద్దీ వాటి ధర పెరుగుతుంది. అందుకే ధనవంతులు దీనిని కేవలం వాచ్‌గా కాకుండా ఒక పెట్టుబడిగా భావిస్తారు. సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో కూడా రోలెక్స్ వాచీలకు విపరీతమైన ధర పలుకుతుంది.
5. డిమాండ్ ,సప్లై :
రోలెక్స్ ఏడాదికి సుమారు 8 నుంచి 10 లక్షల వాచీలను మాత్రమే తయారు చేస్తుంది. కానీ కొనే వారు మాత్రం కోట్లలో ఉన్నారు. కంపెనీ కావాలని సప్లైని తక్కువగా ఉంచుతుంది. దీని వల్ల మార్కెట్‌లో ఆ వాచ్‌లకు ఎప్పుడూ ‘వెయిటింగ్ లిస్ట్’ ఉంటుంది. ఈ కొరతే వాటి ధరను విపరీతంగా పెంచుతుంది.
6. బ్రాండ్ లెగసీ, మార్కెటింగ్:
రోలెక్స్ చరిత్ర 1905 నుంచి ప్రారంభమైంది. ప్రపంచం లోనే మొట్ట మొదటి వాటర్ ప్రూఫ్ వాచ్‌ను తయారు చేసిన ఘనత వీరిదే. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినా.. సముద్రం అడుగున లోతులకు వెళ్లినా రోలెక్స్ వాచీలు పనిచేస్తాయి అని నిరూపించారు. జేమ్స్ బాండ్ వంటి ప్రసిద్ధ పాత్రలు, క్రీడాకారులు దీనిని వాడటం వల్ల దీనికి గ్లోబల్ ఇమేజ్ వచ్చింది.