Harish Rao: బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అరెస్టును మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. క్యాతనపల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకు బాల్క సుమన్ ను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. క్యాతన్ పల్లిలో BRS పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన తీరు చూసి యావత్ తెలంగాణ అసహ్యించుకుంటోందని ఆరోపించారు.
అధికార బలం, పోలీసు బలం, ధన బలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అని హరీశ్ రావు ఆరోపించారు. రాష్ట్రమంతా కాంగ్రెస్ మార్కు గూండాగిరి రాజ్యమేలుతోందని, మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ రాజకీయాలు మురుగు వాసన కొడుతున్నాయని విమర్శించారు. హంగ్ వచ్చిన చోటల్లా ప్రతిపక్ష నాయకులను సంత భేరం చేస్తూ, కిడ్నాపులకు తెగబడుతూ ప్రజా తీర్పును కాలరాస్తున్నారని దయ్యబట్టారు.
జనగాంలో దళిత మహిళా కౌన్సిలర్ బీఆర్ఎస్ కు మద్దతుగా చెయ్యి ఎత్తితే రిటర్నింగ్ ఆఫీసర్ సాక్షిగా కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని సమాజం కళ్లారా చూసిందని హరీశ్ రావు అన్నారు. తమ కళ్ళెదుట ఒక దళిత మహిళా నాయకురాలిపై కాంగ్రెస్ నాయకులు దాడికి తెగబడితే అధికారులు, పోలీసులు కళ్లప్పగించి చోద్యం చూశారే తప్ప అడ్డుకోలేదని ఆరోపించారు. రక్షణ కల్పించక పోగా నిస్సిగ్గుగా కాంగ్రెస్ గూండాలకు కొమ్ముకాయడం కాంగ్రెస్ పాలనలో ప్రజస్వామ్య వ్యవస్థలు పతనమైపోతున్న తీరుకు నిదర్శనమని మండిపడ్డారు.
క్యాతనపల్లే కాకుండా తొర్రూరు, జనగాం, ఇబ్రహీంపట్నం, జహీరాబాద్ సహా హంగ్ వచ్చిన ప్రతి చోటా ప్రజా తీర్పును గౌరవించకుండా చైర్మన్ పీఠాలను అడ్డదారుల్లో కాంగ్రెస్ దక్కించుకుందని హరీశ్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో భూములను కబ్జా చేసినట్లే, రాజకీయ పీఠాలను కూడా కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్క సుమన్ ను భేషరతుగా విడుదల చేయాలని, ప్రజాస్వామిక వాతావరణంలో క్యాతన్ పల్లి చైర్మన్ ఎన్నిక జరిగేలా బాధ్యత వహించాలని ఎన్నికల కమిషన్ ను హరీశ్ రావు డిమాండ్ చేశారు.
Also Read: Movie Titles: టైటిల్ మారితే తిరుగులేని హిట్టే.. సుహాస్ ‘హే బల్‌వంత్’ కూడా అదే బాటలో!