Harish Rao vs KCR: తెలంగాణలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతల్లో హరీశ్ రావు ఒకరు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత ఆ స్థాయి ఫాలోయింగ్ కలిగిన నేతగా హరీశ్ రావుకు పేరుంది. అయితే కేసీఆర్ తదనంతరం బీఆర్ఎస్ పగ్గాలు ఎవరికిన్నా అంశంలో కేటీఆర్, హరీశ్ రావు మధ్య గట్టి పోటీ నడుస్తున్నట్లు గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. అల్లుడి కంటే కొడుకు వైపే కేసీఆర్ నిలబడ్డారన్న అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కాంగ్రెస్ శ్రేణులు నెట్టింట పోస్ట్ చేసిన ఓ వీడియో అందరిని దృష్టిని ఆకర్షిస్తోంది. వీడియోలోని కంటెంట్ పాతదే అయినప్పటికీ.. తాజా పరిణామాలకు సరిగ్గా మ్యాచ్ అవుతుండటంతో ఒక్కసారిగా దీనిపై రాజకీయంగా చర్చ మెుదలైంది.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) సీటుపై అల్లుడు హరీశ్ రావు కన్నేశారంటూ కాంగ్రెస్ అనుబంధ సోషల్ మీడియా ఖాతా ‘తెలంగాణ గళం’ ఓ ఆసక్తిక వీడియోను పంచుకుంది. 2018 నాటి ఓ ఇంటర్వ్యూలో.. కేసీఆర్ సీఎం మళ్లీ సీఎం అయ్యాక హరీశ్ రావు కేబినేట్ లో కొనసాగుతారా? అని యాంకర్ ప్రశ్నిస్తారు. అప్పుడు హరీశ్ రావు బదులిస్తూ.. కేసీఆర్ ఏది చెప్తే అది చేయడానికి తాను సిద్దమని స్పష్టం చేశారు. మరోవైపు అదే వీడియోలో 2018లో కేసీఆర్ పై పోటీ చేసిన గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి (ప్రస్తుతం బీఆర్ఎస్) హరీశ్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. హరీశ్ రావు గుర్తుతెలియని నెంబర్ నుంచి కాల్ చేసి.. కేసీఆర్ ఓడించాలని సూచించినట్లు చెప్పారు.
మామనే టార్గెట్ చేసిండు అంటే.. ఇంక బామ్మర్దిని ఏం వదులుతడు ? pic.twitter.com/jPy77mY8RM
— Telangana Galam (@TelanganaGalam_) April 3, 2026
సదరు వీడియోలో వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ను ఓడించాలని హరీశ్ రావు పట్టుబట్టినట్లు చెప్పారు. ‘ఎంతైన కష్టపడు.. మా మామను ఓడించు. ఆర్థికంగా నేను సాయం చేస్తా. కేసీఆర్ ఉంటే నా రాజకీయం జీవితం ఉండదు. కేటీఆర్ కే అన్ని అప్పచెబుతున్నారు. మా మామను ఓడగొడితే ఆయన చరిత్ర బంద్ అయిపోతుంది’ అని హరీశ్ రావు తనతో చెప్పినట్లు ప్రతాప్ రెడ్డి చెప్పుకొచ్చారు. 2018 నాటి ఆ వీడియోను ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. మామనే ఈ విధంగా టార్గెట్ చేస్తే బామ్మర్ది (కేటీఆర్)ను ఇంకెలా వదలిపెడతారని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన వంటేర్ ప్రతాప్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ తరపున గజ్వేల్ నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఉండటం గమనార్హం.
Also Read: పెళ్లితో ఫ్యాన్స్ కు సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన షణ్ముఖ్.. ఫోటోలు వైరల్!
వాస్తవానికి హరీశ్ రావు బహిరంగంగా ఎప్పుడూ కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడలేదు. తమది తండ్రి కొడుకుల అనుబంధమని ఆయన పలుమార్లు చెప్పుకొచ్చారు. అయితే పార్టీలో అనూహ్యంగా కేటీఆర్ కు ప్రాధాన్యం పెరగడంతో ఆయనలో అసంతృప్తి రగిలిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. 2018 ఎన్నికల తర్వాత కేటీఆర్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి.. హరీశ్ రావుకు కొంత కాలం మంత్రి పదవి ఇవ్వకపోవడం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కేసీఆర్ తన రాజకీయ వారసుడిగా కేటీఆర్ ను ప్రోత్సహిస్తున్నారన్న అభిప్రాయం హరీశ్ రావు వర్గీయుల్లో నాటుకు పోయింది.
పార్టీకి కష్టం వచ్చినప్పుడల్లా అండగా ఉన్న తనకు.. ఆశించిన స్థాయిలో కేసీఆర్ నుంచి మద్దతు లభించడం లేదన్న అభిప్రాయం హరీశ్ లో ఉండిపోయిందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారబోతున్నారని.. బీజేపీలో చేరుతున్నారంటూ గతంలో పెద్ద ఎత్తున ప్రచారం సైతం జరిగింది. ఇటీవల కవిత వచ్చి కూడా హరీశ్ రావును టార్గెట్ చేయడం ఆయనలో అభద్రతాభావాన్ని మరింత పెంచిందని నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనా దీనిపై హరీశ్ రావు బహిరంగంగా క్లారిటీ ఇవ్వనంతవరకూ దీనిపై చర్చ కొనసాగుతూనే ఉంటుందన్నది వాస్తవం.
Also Read: Rakasa Movie : ‘రాకాస’ మూవీకి సంగీత్ శోభన్ రెమ్యూనరేషన్ అంత తక్కువ..? మరీ అన్యాయం..