అది తెలంగాణ భవన్.. అక్కడే ఉన్న క్యాంటిన్లో ఇద్దరు దోస్తులు చాయ్ తాగుతున్నరు. చుర్రుమనిపిస్తున్న ఆకాశానికేసి చూస్తూ… జేబులున్న దస్తీతో చెమట తుడుచుకుంటూ అక్కడే ఉన్న కేసీఆర్ ఫ్లెక్సీ వైపు ఆసక్తిగా చూసిండు. చటుక్కున ఏదో గుర్తొచ్చినట్టుగా.. పక్కనున్నోడితో ఇట్లన్నడు..
‘‘మనోళ్లు మస్తు సంబరపడుతుండ్రా బై ’’
పక్కనున్నోడికి సమజ్ కాలే.
‘‘ జీవన్‌రెడ్డి పార్టీలో చేరినందుకా? ’’
‘‘కాదు.. ఫామ్‌హౌజ్‌లో పెద్దసారును చూసినంక.. ’’
‘‘అదేందీ. పెద్దసారు ఎవరికి టైం ఇస్తడు? కాకులు దూరని కారడవి.. చీమలు దూరని చిట్టడివి లెక్క ఆ ఫామ్‌హౌజ్‌లోకి ఎవరికీ ఎంట్రీ లేదు కదా?’’ కండ్లు చిట్లించి .. ఆశ్చర్యంగా ముఖం పెట్టిండు.
‘‘ జీవన్‌రెడ్డి చేరిక సందర్భంగా కేసీఆర్‌ను కలిసిండు కదా. ఆ ఫోటోలు చూసి సంబుపడ్డారట..!’’
‘‘ అయితే ఆ ఫోటోలో ఏముందని సంబురపడ్డరు బై. నాకైతే సమైతలేదు..’’ చికాకుగా ముఖం పెట్టిండు ఆ రెండోడు.
‘‘అరే దేడ్ ధిమాఖ్.. అండ్ల మన పెద్దసారు ముఖం చూడలేదా? ’’
‘‘అవు.. చూసిన.. ’’ జుట్టు పీక్కుంటే బాగుండనిపిస్తుంది అతనికి.
‘‘ఇంకా సమజ్ కాలేదా? పెద్ద సారు ముఖం వెలిగిపోతున్నది. మస్తుగా కనిపించిండు.. ’’
‘‘అరే మన పెద్దసారు పానం బాగలే.. బాగలే అని అంటుండ్రు కదా..! అగో ఆళ్లను చూపియ్యాలె గీ ఫోటో ’’
‘‘అవ్ నేను బీ సూసిన.. సార్ జర తెల్లగ సుక అయ్యిండు.. ’’
‘‘అరే ఆ నవ్వు చూసి ఎన్రోజులైంది బై. అబ్బ నాకైతే కడుపు నిండిందనుకో! ’’
‘‘నువ్వు చెప్తుంది నిజమేరా బై.. నేను సుక గా ఫోట్వను నా ఫోన్ల జూమ్ జేసి మరీ మరీ చూసిననుకో.. ’’
‘‘అందరూ ఆయన పానం గురించి మాట్లాడుతుంటే బాధనిస్తుండెరా బై..! ’’ టేబుల్ మీదుస్త దస్తీతో ముఖం తుడుచుకున్నడు… మొదటోడు. కళ్లల్లో కొంచెం తడి కనిపిస్తున్నది.
‘‘గిప్పుడైతే శాన సంతోషంగా ఉంది… సారు ఇట్లనే ఉండాలె. మంచిగుండాలె..! ’’
‘‘ఎహె సారుకేమైతదిరా.. శానా ఏండ్ల సంది గిసొంటి మాటలు ఇంటనే ఉన్నం కదా! ’’
‘‘అరే గప్పటిసంది ఇన్నవి వేరే. మొన్న ఓడినంక సారు మస్తు దివాల దీసిండనుకో! ’’
‘‘రెండోడు తల ఊపిండు.. అవ్.. నిజమే అన్నట్టుగా ఉన్నాయతని చూపులు.
‘‘కిందపడి కాలిరిరినంక నాకైతే బుగులే అయ్యింది. సారు మళ్లా బయటకు వస్తడా? రాడా అని? ’’
‘‘కానీ, ఏ మాటకామాటర బై.. సారు ఇగనైనా బయటకు రావాలె…! ’’
‘‘నేనొకటి మాట్లాడితే .. నువ్వొకటి చెప్తవేందిరా..! ’’
చురచుర లేచి పోయిండు మొదటోడు సగం చాయే తాగి.