DMHO Recruitment: స్వేచ్చ బ్యూరో: మేడ్చల్ జిల్లాలో నిరుద్యోగులకు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. జాతీయ ఆరోగ్య మిషన్, పట్టణ జాతీయ ఆరోగ్య మిషన్ తదితర పథకాల పరిధిలో మొత్తం 16 కేటగిరీల్లో వివిధ పోస్టులను కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె. ఆనంద్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 23 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
నోటిఫికేషన్ ప్రకారం మెడికల్ ఆఫీసర్ పోస్టులు 17, స్టాఫ్ నర్స్ పోస్టులు 50, సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులు 9, ఎంఎల్‌హెచ్‌పీ/సీహెచ్‌ఓ/ఎంఓ పోస్టులు 13, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 16, ఏఎన్‌ఎం పోస్టులు 8, ఫార్మసిస్ట్ పోస్టులు 4తో పాటు జిల్లా ఎపిడెమియాలజిస్ట్, పబ్లిక్ హెల్త్ మేనేజర్, పీపీఎం/ఏసీఎస్‌ఎం కోఆర్డినేటర్, టీడీ మినీహబ్ మేనేజర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 16 కేటగిరీల్లో 120 పోస్టులు ఉన్నట్లు వివరాలు సూచిస్తున్నాయి.
పోస్టును బట్టి నెలకు రూ.15,600 నుంచి రూ.52,000 వరకు వేతనం అందించనున్నారు. మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంబీబీఎస్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. స్టాఫ్ నర్స్ పోస్టులకు బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం లేదా సంబంధిత నర్సింగ్ అర్హతలు ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఇంటర్మీడియట్‌తో పాటు మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో డిప్లొమా లేదా సంబంధిత అర్హత అవసరం. ఫార్మసిస్ట్ పోస్టులకు డి.ఫార్మసీ లేదా బి.ఫార్మసీ అర్హతలు, సంబంధిత కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి. ఇతర పోస్టులకు నిర్దేశించిన విద్యార్హతలు, అనుభవం తప్పనిసరిగా కలిగి ఉండాలి.
నోటిఫికేషన్ నంబర్ 286/E1/DMHO/MDCL/2026 ప్రకారం ఈ నెల 23 నుంచి 28వ తేదీ వరకు, ఆదివారం మినహా, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులు రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పేరిట సమర్పించాలి.దరఖాస్తులను జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం, ఎఫ్-1, ఐడీఓసీ భవనం, అంతాయిపల్లి, శామీర్‌పేటలో అందజేయాలి. దరఖాస్తు ఫారం, పూర్తి మార్గదర్శకాల కోసం జిల్లా అధికారిక వెబ్‌సైట్ https://medchal-malkajgiri.telangana.gov.in ను సందర్శించాలని అధికారులు సూచించారు. విద్యార్హతలు, అనుభవ ధ్రువపత్రాలు, సంబంధిత రిజిస్ట్రేషన్ పత్రాలు, ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్‌తో కూడిన పూర్తి దరఖాస్తును గడువులోగా సమర్పించాలి. ఎంపిక సమయానికి అందుబాటులో ఉన్న ఖాళీలను బట్టి పోస్టుల సంఖ్య పెరగవచ్చని లేదా తగ్గవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌లోని పూర్తి నిబంధనలను పరిశీలించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె. ఆనంద్ సూచించారు.
Also read: ఇబ్రహీంపట్నం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!