MVSR Accident:హైదరాబాద్ నగర శివార్లలోని నాదర్గుల్లో ఉన్న ఎంవీఎస్ఆర్ (MVSR) ఇంజినీరింగ్ కాలేజీలో దసరా వేడుకల సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా దాండియా ఆటలు ఆడుతుంటే భారీ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన ఇనుప క్రేన్ ఒక్కసారిగా కూలిపోవడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.ఇక ఇదే సంఘటనలో 12మంది గాయపడ్డారని తెలుస్తుంది.
కాలేజీ క్యాంపస్ లో దాండియా
దసరా పండుగ సందర్భంగా కాలేజీ క్యాంపస్ లో దాండియా వేడుకలను ఏర్పాటు చేశారు కాలేజీ నిర్వాహకులు . ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇక కాలేజీ క్యాంపస్ వారి ఆటపాటలతో సందడిగా మారిపోయింది.
ఇక అదే సమయంలో స్టూడెంట్స్ గుంపులుగా చేరి దాండియా ఆడుతుండగా భారీ లైటింగ్ కోసం ఉపయోగించిన ఇనుప క్రేన్ ఒక్కసారిగా కుప్పకాలింది. దాంతో ఆ ఇనుప క్రేన్ కి దగ్గరగా ఉన్నవారిలో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.అందులో ఒక యువతి ఉందని తెలుస్తుంది .
తొక్కిసలాటలో 12మందికి తీవ్ర గాయాలు
ఇక అక్కడ భయంతో ఏం జరిగిందో అర్థం కాక కొందరు విద్యార్థులు అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ గందర గోళంలో జరిగిన తొక్కిసలాటలో 12మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
అయితే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న విద్యార్థులు, కాలేజీ సిబ్బంది స్పందించారు.లేకపోయి ఉంటే మృతుల సంఖ్య మరింత పెరిగేదని వినిపిస్తుంది.ఇక తీవ్రంగా గాయపడిన వారిని ఆలస్యం చేయకుండా సమీపంలోని ఆసుపత్రులకు తరలించారని, ప్రస్తుతం వారికి ట్రీట్మెంట్ జరుగుతుందని తెలుస్తోంది.
ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా?
ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి దారితీసిన కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. భారీ లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసిన ఇనుప క్రేన్ బరువును తట్టుకోలేక కూలిపోయిందా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాలని ఆరా తీస్తున్నారు.
సాధారణంగా కాలేజీల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరవుతుంటారన్న సంగతి తెలిసిందే. అలాంటి సందర్భాల్లో వేదికలు, లైటింగ్ సిస్టమ్లు, ఇనుప నిర్మాణాలు ఏర్పాటు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనా పండుగను ఆనందంగా జరుపుకోవాల్సిన సమయంలో జరిగిన ఈ దుర్ఘటన విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక జరిగిన ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. మృతులు, గాయపడ్డ వారు ఎవరు ఏంటి అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.