South India Security: స్వేచ్ఛ బ్యూరో: సురక్షిత దక్షిణ భారత్ లక్ష్యంగా ఆయా రాష్ట్రాల పోలీసు యంత్రాంగాలు పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దీన కోసం దక్షిణాది రాష్ట్రాల పోలీసుల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసుకోవాలన్నారు, మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థలో విస్తృత సంస్కరణలు, నేరాల నియంత్రణకు పటిష్ఠమైన కార్యాచరణ రూపొందించాలని పిలుపు నిచ్చారు. హైదరాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో శుక్రవారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీలతోపాటు వేర్వేరు కేంద్ర దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులతో జరిగిన సమన్వయ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సమన్వయ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళం రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, లక్షద్వీప్ కు చెందిన డీజీపీలు, ఐజీలు, ఇంటెలిజెన్స్ బ్యూరో, సీబీఐ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ, సిఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎన్‌ఎస్‌జీలకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
భవిష్యత్ భద్రతకు పెట్టుబడి..
ఈ సందర్భంగా ముఖ్కమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థపై చేసే వ్యయాన్ని సమాజ భద్రత, మెరుగైన భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగా భావించాలన్నారు. హైదరాబాద్ ప్రాంతంలో పోలీసు వ్యవస్థను హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మూడు కమిషనరేట్లుగా విభజించడం ద్వారా స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం కలిగిందన్నారు. నేరాల స్వరూపానికి అనుగుణంగా హైడ్రా, ఈగల్, టీ సేఫ్, టీ మార్స్ వంటి ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేశామని వివరించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక విభాగాలు దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాల కట్టడిలో తెలంగాణ పోలీసులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు.
మావోయిస్ట్ రహితంగా మార్చాం..
ప్రధానమంత్రి ప్రగతి సమీక్ష సమావేశంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్టు రహితంగా మార్చడంలో కృషి చేసిన పోలీసు అధికారులను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అభినందించారని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణలో ఈగల్ ఫోర్స్‌కు కేంద్ర ప్రభుత్వ అంచనాల్లో 80 శాతానికి పైగా మార్కులు లభించాయని తెలిపారు. సైబర్ మోసాల బాధితులకు డబ్బు తిరిగి అందించడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక ప్రమాణాలను నెలకొల్పిందన్నారు. అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తరహాలో ఆహార కల్తీ, ఔషధాల నియంత్రణకు సంబంధించిన చర్యలను సమన్వయం చేసేందుకు టీ సేఫ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. చెరువులు, జలవనరులను పరిరక్షించడం, పునరుద్ధరించడం, ప్రజా ఆస్తులను కాపాడటంలో హైడ్రా ప్రజల మన్ననలు పొందుతోందన్నారు.
సురక్షిత దక్షిణ భారతమే లక్ష్యం
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లను నియమించి దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. పోలీసు సిబ్బంది కుటుంబాల సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్టు సీఎం చెప్పారు. ఉన్నత స్థాయి ప్రమాణాలతో యంగ్ ఇండియా పోలీసు స్కూల్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు హోదా, సర్వీసును బట్టి కనీసం కోటి నుంచి గరిష్ఠంగా 2 కోట్ల వరకు ఎక్స్ గ్రేషియా, ఇంటి స్థలాలు, అర్హులైన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ఏ ఒక్క రాష్ట్రం తనంతట తానుగా నేరరహితంగా మారలేదని, ముఖ్యంగా సరిహద్దులు దాటి జరిగే నేరాలను అరికట్టేందుకు రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య సమన్వయం అత్యవసరమని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలతో సాంకేతిక మౌలిక సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను పంచుకునేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు. సమష్టి కృషితో సురక్షిత దక్షిణ భారతాన్ని నిర్మించాలని పిలుపునిస్తూ, సమావేశం విజయవంతం కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
నోడల్ అధికారులను నియామకం..డీజీపీ
నేరాల కట్టడికి దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి కార్యాచరణతోపాటు ఉమ్మడి సెక్రటేరియట్ ను ఏర్పాటు చేసి, అన్ని దక్షిణాది రాష్ట్రాలు నోడల్ అధికారులను నియమించాలని డీజీపీ సీ.వీ.ఆనంద్ అన్నారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదాన్ని సమర్థంగా అరికట్టేందుకు రాష్ట్రాల మధ్య సమాచార మార్పిడి, సమన్వయాన్ని బలోపేతం చేయాలన్నారు. గతంలో మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టేందుకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి, జిల్లా పోలీసుల సమన్వయంతో సమర్థవంతమైన ఆపరేషన్లు నిర్వహించామని వివరించారు. ఈ కృషితో తెలంగాణ నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ విజయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించిన విషయాన్ని గుర్తు చేశారు. గత సెప్టెంబరు 22న న్యూ ఢిల్లీ లో జరిగిన సమావేశంలో డ్రగ్స్ నియంత్రణ చర్యలకు గాను ఈగల్ ఫోర్స్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా జాతీయ స్థాయి పురస్కారం అందుకోవడం గర్వకారణమన్నారు. సైబర్ నేరాల బాధితులకు ఉపశమనం కల్పించడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కీలకంగా పనిచేస్తోందన్నారు. సైబర్ మోసాల బాధితులకు పోర్టళ్ల ద్వారా రూ.69.4 కోట్లను తిరిగి అందించినట్లు తెలిపారు. ప్రధానమంత్రి ప్రగతి సమీక్షలో సైబర్ భద్రతా విభాగం వరుసగా రెండుసార్లు జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలవడం పోలీసు శాఖ పనితీరుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిర్వహణ, రహదారి భద్రత కోసం ట్రాఫిక్ మేనేజ్ మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేశామన్నారు.
బెస్ట్ పోలీసింగ్ ప్రాక్టీస్ పై ప్రెజెంటేషన్స్..
తమిళనాడు డీజీపీ డాక్టర్ మహేష్ అగర్వాల్ మాట్లాడుతూ మహిళలు, పిల్లల భద్రతతోపాటు పోలీసు సిబ్బంది మానసిక ఆరోగ్యానికి చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. సింగప్పన్, ‘కావల్ కరంగల్’ కార్యక్రమం ద్వారా ఒత్తిడి నిర్వహణ, భావోద్వేగ నియంత్రణ వంటి అంశాల్లో సిబ్బందికి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ‘మగిళ్చి’ కార్యక్రమాన్ని 2018లో ప్రారంభించి, ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యలున్న పోలీసు సిబ్బందికి మానసిక సహాయం, కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల కింద 2,008 కేసులు నమోదు కాగా, 41,915 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 367 ఫిర్యాదులను పరిష్కరించినట్లు వివరించారు. కేరళం ఐజీ అజిత బేగం మాట్లాడుతూ పాఠశాలల్లో స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ కార్యక్రమం ద్వారా 1,201 పాఠశాలల్లో 98 వేల మందికి శిక్షణ అందించినట్టుతెలిపారు. 484 జనమైత్రి పోలీస్ స్టేషన్ల ద్వారా కమ్యూనిటీ పోలీసింగ్‌ను బలోపేతం చేస్తున్నట్టు పేర్కొన్నారు. 148 చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్లలో పిల్లలకు సేవలు అందిస్తున్నట్లు వివరించారు.
పుదుచ్చేరి డిజిపి శాలిని సింగ్..
ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేసేందుకు 2025లో ‘మక్కల్ మండ్రం’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు పుదుచ్చేరి డీజీపీ శాలినీ సింగ్ చెప్పారు. మహిళలను హింస నుంచి రక్షించి, స్వీయ రక్షణలో శిక్షణ ఇచ్చేందుకు 2025 మార్చిలో ‘మిషన్ వీరమంగై’ ప్రారంభించినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఈగల్ ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ గంజాయి నిర్మూలనకు ‘ఆపరేషన్ చైతన్యం’ కింద చేపడుతున్న చర్యలను వివరించారు. గంజాయి అక్రమ రవాణాను గుర్తించడం, గిరిజన ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, మాదకద్రవ్యాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేయడం వంటి అంశాలను ప్రస్తావించారు. మహిళలు, పిల్లల ఆచూకీ గుర్తించేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ ట్రేస్’ వివరాలను వెల్లడించారు. 2025 ఆగస్టు నుంచి గత ఆగస్టు వరకు 11,242 మంది తప్పిపోయిన మహిళలు, పిల్లలను గుర్తించినట్టు తెలిపారు.
సమాచార నిర్వహణపై ప్రజెంటేషన్
లక్షద్వీప్ ఏడీజీ శంకర్ జైస్వాల్ తీర ప్రాంత భద్రతను బలోపేతం చేసేందుకు మత్స్యకారులతో సమన్వయం, తీర గ్రామాల్లో పర్యటనలు, జాతీయ పర్వదినాల్లో జెండా ఆవిష్కరణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు. ‘సాగర్ కవచ్’ పేరుతో ఏడాదికి రెండుసార్లు, ‘సాగర్’ పేరుతో నెలకోసారి తీర భద్రతా విన్యాసాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ‘సీ విజిల్’ కార్యక్రమంతోపాటు తీర ప్రాంత గస్తీ, పర్యాటకుల రాకపోకలు, అనుమతుల పర్యవేక్షణకు సంబంధించిన విధానాలను వివరించారు. ‘తట్ కవచ్’ పోర్టల్ ద్వారా తీర భద్రతకు సంబంధించిన సమాచార నిర్వహణపై ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో డీజీ మహేష్ భగవత్, ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, సీఐడీ డీజీ చారు సిన్హా, డీజీ అనిల్ కుమార్, హైదరాబాద్ సీపీ సజ్జనార్, ఇంటిలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: ఎల్‌నినో ముప్పు.. తెలంగాణ ప్రభుత్వం బిగ్ ప్లాన్! భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు