భారతీయ రైల్వే నెట్ వర్క్ దేశ వ్యాప్తంగా విస్తరించి ఉంది. అన్ని రాష్ట్రాలను కలుపుతూ.. ప్రయాణీకులకు మెరుగైన రవాణా సేవలను అందిస్తున్నది రైల్వే సంస్థ. ప్రతి రైల్వే స్టేషన్ లో మెక్ సెట్ల ద్వారా ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు రైళ్లకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. రైళ్ల రాకపోకలు, రైల్వే స్టేషన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రైల్వే సంస్థ అందించే ప్రత్యేక ఆఫర్లు సహా బోలెడు విషయాలను అనౌన్స్ చేస్తుంటారు. ఇక రైళ్ల షెడ్యూల్, రాకపోకలు, బయల్దేరే విషయలను ముందుగానే రికార్డు చేసి, సందర్భాన్ని బట్టి ప్రయాణీకులకు వినిపిస్తుంటారు. రైల్వే స్టేషన్లలో వినిపించే ఓ లేడీ వాయిస్ అందరినీ ఆకట్టుకుంటుంది. చక్కటి గొంతుతో అందరికీ అర్థమయ్యేలా రైల్వే అనౌన్స్ మెంట్స్ ఇస్తుంది. ఈ వాయిస్ ఎవరు విన్నా, కచ్చితంగా ఈ వాయిస్ చెప్పేది ఓ మహిళ అనుకుంటారు. మీరు అలాగే అనుకుంటే తప్పులో కాలేసినట్లే! ఇంతకీ ఆ వాయిస్ చెప్పేది ఎవరో తెలుసా?
అచ్చం అమ్మాయి వాయిస్ లా ఆకట్టుకుంటున్న శ్రవణ్
రైల్వే స్టేషన్ లో వినిపించే చక్కటి ఫీమేల్ వాయిస్ చెప్పేది శ్రవణ్ అడోడ్. మహారాష్ట్రలోని పర్లి వైజానాథ్ కు చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచే ఆయనకు రైళ్లు అంటే చాలా ఇష్టం. రైల్వే స్టేషన్లలో వినిపించే వాయిస్ అతడిని ఎంతగానో ఆకట్టుకునేది. నెమ్మదిగా రైల్వే స్టేషన్ లో వినిపించే వాయిస్ ను బాగా ప్రాక్టీస్ చేశాడు. అచ్చం ఫీమేల్ వాయిస్ లాగే చెప్పడం మొదలు పెట్టాడు. మిత్రుల దగ్గర ఆయన రైల్వే స్టేషన్ లో చెప్పే అనౌన్స్ మెంట్ చెప్తే నిజంగా ఆశ్చర్యపోయేవారు. అచ్చం అమ్మాయి లాగే అద్భుతంగా చెప్తున్నావంటూ అభినందించేవారు. చివరకు ఈ వాయిస్ ద్వారా అతడు భారతీయ రైల్వేలో ప్రైవేట్ ఉద్యోగిగా చేరాడు. ఆయన ఫీమేల్ వాయిస్ తో చెప్పే ప్రకటనలు ప్రయాణీకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రైల్వే అధికారులు సైతం శ్రవణ్ వాయిస్ కు ఫిదా అయ్యారు.
దేశ వ్యాప్తంగా పలు స్టేషన్లలో..
శ్రవణ్ చెప్పిన రైల్వే ప్రకటనలకు సంబంధించిన రికార్డింగ్స్ ప్రస్తుతం దేశంలోని పలు రైల్వే స్టేషన్లలో ఉపయోగిస్తున్నారు. ఆయన రియల్ టైమ్ అనౌన్స్ మెంట్లను రూపొందించడానికి డిజిటల్ గా ప్రాసెస్ చేస్తారు. అంటే, ఆయన వాయిస్ ముందుగా రికార్డ్ చేయబడినప్పటికీ, సిస్టమ్ ద్వారా చిన్న చిన్న సవరణలు చేస్తారు. ఫైనల్ గా ఆయన వాయిస్ అచ్చం ఫీమేల్ మాదిరగానే ఉంటుంది. వాయిస్ లో కమ్మదనం, చెప్పే విషయంలో క్లారిటీ కారణంగా ప్రయాణీకులకు ఇట్టే అర్థం అవుతుంది. తన చిన్ననాటి మిత్రులు అమ్మాయిలా అనౌన్స్ మెంట్స్ చెప్తే ఎంతో అభినందించినా, కాలేజీ సమయంలో తోటి విద్యార్థుల నుంచి అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ, ఇప్పుడు అదే వాయిస్ తనకు జీవనాధారంగా మారిందన్నారు శ్రవణ్. “కాలేజీ రోజుల్లో నా వాయిస్ విని చాలా మంది అవమానించారు. కానీ, ఇప్పుడు నేను అదే వాయిస్ తో భారతీయ రైల్వేలో ఉద్యోగం సంపాదించాను. నా వాయిస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా పలు స్టేషన్లలో వినిపిస్తున్నది. ముంబై CSMTలోని సీనియర్ అనౌన్సర్లు నన్ను అభినందించినప్పుడు చాలా సంతోషం అనిపించింది. నాకు చక్కటి అవకాశం కల్పించిన భారతీయ రైల్వే సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని శ్రవణ్ వివరించారు. నిజంగా ఆయనలోని టాలెంట్ ఎంతో మందికి ఆదర్శం అంటున్నారు నెటిజన్లు.
Read Also: స్ట్రీరింగ్ ఉండదు, డ్రైవర్ అవసరం లేదు.. ప్రపంచాన్ని ఏలబోతున్న ఎలన్ మస్క్ రోబో ట్యాక్సీలు!