NC24..అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగచైతన్య (Naga Chaitanya).. టైర్ -2 హీరోగా సెటిల్ అయిపోయారు. స్టార్ హీరో హోదా దక్కించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అదృష్టం మాత్రం వరించలేదు. ఇకపోతే నాగచైతన్య ఈమధ్య సినిమాలతో కాకుండా వ్యక్తిగత కారణాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తన మాజీ భార్య సమంత (Samantha)నుంచి 2021 లో విడిపోయిన నాగచైతన్య మరుసటి ఏడాది శోభిత ధూళిపాల(Shobhita dhulipala)తో ప్రేమలో పడ్డారు. డేటింగ్ కూడా చేసిన ఈ జంట ఈ ఏడాది ఆగస్టు 8న నిశ్చితార్థంతో ఒక్కటయ్యారు. ఈ ఏడాది డిసెంబర్ 4వ తేదీన పెళ్లి పీటలెక్కారు ఈ జంట. ఇక అలా తన మనసుకు నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకొని అటు వ్యక్తిగతంగా కాస్త రిలాక్స్ అయిన నాగచైతన్య ఇప్పుడు మళ్లీ సినిమాల పైన ఫోకస్ చేయబోతున్నారని సమాచారం.
హీరోయిన్ గా శ్రీ లీల..
ఇదిలా ఉండగా నాగచైతన్య తండేల్ మూవీ తర్వాత విరూపాక్షా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న కార్తిక్ వర్మ దండు (Karthik Varma dandu) దర్శకత్వంలో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. నాగచైతన్య కెరియర్ లో 24వ సినిమాగా వస్తున్న ఈ చిత్రం మైథాలజికల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా మొదట ఈ సినిమాలో మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary)ని హీరోయిన్ గా తీసుకోవాలని చిత్ర బృందం అనుకున్నప్పటికీ, తాజాగా ‘పుష్ప 2’ క్రేజ్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న శ్రీలీల (Sree Leela)ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. త్వరలోనే వీరిద్దరికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా చిత్ర బృందం షేర్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఒక అద్భుతమైన కన్ను ప్రతీకతో పాటు రాక్ క్లైమింగ్ టూల్స్ తో ఒక పర్వతంపై నాగ చైతన్య నిలబడి కనిపించారు. ఈ పోస్టర్ బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఫిబ్రవరి -7న తండేల్ మూవీ విడుదల..
ఇదిలా ఉండగా ప్రస్తుతం నాగచైతన్య ప్రముఖ డైరెక్టర్ చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో ‘తండేల్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండగా, అల్లు అరవింద్ సమర్పకుడిగా పనిచేస్తున్నారు. శ్రీకాకుళంలోని కొందరు మత్స్యకారుల జీవితం, సముద్రంలో వారు ఎదుర్కొంటున్న సంఘటనలు దేశం మొత్తాన్ని కదిలిస్తున్న విషయం తెలిసిందే. ఈ కథ వినగానే వెంటనే చేయాలనిపించిందట. అందుకే సహజత్వం కోసం శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారులతో గడిపి వారి అనుభవాలను కూడా తెలుసుకున్నారు నాగచైతన్య. అలా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఇప్పుడు చిత్రాన్ని ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేయబోతున్నారు ఇందులో సాయి పల్లవి (Sai Pallavi)హీరోయిన్గా నటిస్తోంది. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా అక్కినేని అభిమానులు కాలర్ ఎగిరేసేలా ఉంటుందని నిర్మాతలు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు నాగార్జున(Nagarjuna)కెరీర్లో ‘శివ’ మూవీ ఎలాగైతే మైల్ స్టోన్ గా నిలిచిందో.. నాగచైతన్య కెరియర్ లో కూడా ఈ ‘తండేల్’ సినిమా అలా మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. మరి తండేల్ సినిమా నాగచైతన్యకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.