Baby Born on a Plane: ఇంటర్నేషనల్ ప్లైట్ లో ప్రయాణిస్తున్నప్పుడు బిడ్డ జన్మిస్తే ఆ శిశువుకు ఏ దేశ పౌరసత్వం లభిస్తుందనే విషయంలో చాలా మందికి ఆసక్తి ఉంటుంది. విమానం ఏ దేశానికి వెళ్తోంది? ఏ దేశ గగనతలంలో ప్రయాణిస్తోంది? విమానం ఏ దేశంలో నమోదైంది? ఇలాంటి ప్రశ్నలు తలెత్తున్నాయి. అయితే, విమానంలో పుట్టినంత మాత్రాన బిడ్డకు ఆ విమానం చెందిన దేశ పౌరసత్వం ఆటోమేటిక్గా వచ్చేస్తుందని అనుకోవడం పొరపాటు. ఈ విషయంలో తల్లిదండ్రుల పౌరసత్వం, బిడ్డ జన్మించిన ప్రదేశం, ఆయా దేశాల చట్టాలు కీలక పాత్ర పోషిస్తాయి.
ప్రపంచంలోని అనేక దేశాలు జస్ సాంగ్వినిస్ (Jus Sanguinis) అనే సూత్రాన్ని పాటిస్తాయి. అంటే, రక్త సంబంధం ఆధారంగా పౌరసత్వం కల్పించడం. అంటే, బిడ్డ ఎక్కడ జన్మించినా తల్లిదండ్రుల పౌరసత్వం ఆధారంగా ఆ శిశువుకు పౌరసత్వం లభించే అవకాశం ఉంటుంది. భారతదేశంలో కూడా పౌరసత్వానికి సంబంధించి తల్లిదండ్రుల జాతీయత ముఖ్యమైన అంశం. అయితే, భారత పౌరసత్వ చట్టంలో బర్త్ డేట్ ను బట్టి నిబంధనలు మారుతాయి. అందువల్ల తల్లి లేదంటే తండ్రి భారతీయులైనంత మాత్రాన ప్రతి సందర్భంలోనూ బిడ్డకు పౌరసత్వం లభిస్తుందని చెప్పలేం. రూల్స్ ను పరిశీలించాల్సి ఉంటుంది.
జస్ సోలి (Jus Soli) అనే మరో సూత్రం పుట్టిన ప్రదేశం ఆధారంగా పౌరసత్వం కల్పించడాన్ని సూచిస్తుంది. అమెరికా, కెనడా లాంటి దేశాలు కొన్ని నిబంధనలకు లోబడి ఈ విధానాన్ని అనుసరిస్తాయి. ఒక విమానం ఆ దేశ గగనతలంలో ప్రయాణిస్తున్నప్పుడు బిడ్డ జన్మిస్తే, ఆ దేశ పౌరసత్వం లభిస్తుందా? అనే విషయం అక్కడి చట్టాలపై ఆధారపడి ఉంటుంది. అమెరికాలో జన్మించిన ప్రతి బిడ్డకు ఎలాంటి మినహాయింపులు లేకుండా పౌరసత్వం లభిస్తుందని భావించకూడదు. విమానంలో జన్మించిన సందర్భంలోనూ ప్రత్యేక నిబంధనలు, పరిస్థితులను పరిశీలించాల్సి ఉంటుంది.
ఒక విమానం ఏ దేశ గగనతలంలోనూ లేని ప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు బిడ్డ జన్మిస్తే పరిస్థితి మరింత ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి సందర్భంలో విమానం రిజిస్ట్రేషన్ అయిన దేశ చట్టాలు కూడా ప్రాధాన్యం పొందవచ్చు. భారత పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 2(2) ప్రకారం, నమోదైన విమానంలో జన్మించిన వ్యక్తిని ఆ విమానం నమోదైన ప్రదేశంలో జన్మించినట్లుగా పరిగణిస్తారు. అయితే, దీనర్థం విమానం ఏ దేశానికి చెందినదో ఆ దేశ పౌరసత్వం బిడ్డకు తప్పనిసరిగా వస్తుందని కాదు. పౌరసత్వం విషయంలో ఆయా దేశాల చట్టాలను విడిగా పరిశీలించాలి. అమెరికా గగనతలం వెలుపల అమెరికాలో నమోదైన విమానంలో బిడ్డ పుట్టినంత మాత్రాన ఆ శిశువుకు అమెరికా పౌరసత్వం లభించదని అక్కడి విదేశాంగ శాఖ మార్గదర్శకాలు వెల్లడిస్తున్నాయి.
విమానంలో ప్రసవం జరిగితే విమాన సిబ్బంది ఘటన వివరాలను నమోదు చేస్తారు. జనన సమయం, విమానం ఉన్న ప్రదేశం, విమాన ప్రయాణ వివరాలు వంటి అంశాలు అధికారిక పత్రాల తయారీలో ఉపయోగపడతాయి. అనంతరం తల్లిదండ్రులు సంబంధిత అధికారులను సంప్రదించి జనన నమోదు, పాస్పోర్టు, పౌరసత్వానికి సంబంధించిన ప్రాసెస్ పూర్తి చేయాలి. సో, విమానంలో జన్మించిన బిడ్డకు ఏ దేశ పౌరసత్వం వస్తుందనేది ఒక్క అంశంపై ఆధారపడదు. తల్లిదండ్రుల జాతీయత, విమానం ఉన్న గగనతలం, విమానం రిజిస్ట్రేషన్, సంబంధిత దేశాల చట్టాలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
Read Also: చలికాలానికి ముందే మంచు అందాలను చూడాలనుందా? దేశంలో 7 అదిరిపోయే ప్లేసెస్ ఇవే!