IRCTC Resume Booking Feature: రైల్వే టిక్కెట్ బుకింగ్ లో కామన్ గా ఎదురయ్యే సమయ్య పేమెంట్ ఫెయిల్యూర్. అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినా, పేమెంట్ కాదు. ఈ పరిస్థితి ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా టిక్కెట్ వెంటనే అవసరమైనప్పుడు మరింత ఇబ్బందిగా మారుతుంది. ఈ సమస్యకు మంచి పరిష్కారం అందిస్తోంది IRCTC. ఇందుకోసం ‘Resume/Retry Booking’ అనే కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా, పేమెంట్ ఫెయిల్ అయినప్పటికీ, అదే డబ్బుతో మళ్లీ టిక్కెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అంటే, మళ్లీ కొత్తగా డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
ఈ సదుపాయం ఉపయోగించుకోవాలంటే, టిక్కెట్ బుక్ చేసే సమయంలో IRCTC iPay ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇది IRCTC స్వంత పేమెంట్ గేట్ వే. iPay ఉపయోగిస్తే, ట్రాన్సాక్షన్ వివరాలు నేరుగా IRCTC సిస్టమ్‌లో స్టోర్ అవుతాయి. పేమెంట్స్ ఫెయిల్ అయినా, ఆ డబ్బును తిరిగి ఉపయోగించే అవకాశం ఉంటుంది.
ముందుగా మీరు టిక్కెట్ బుక్ చేసే సమయంలో iPay గేట్‌వే ద్వారా చెల్లింపు చేయాలి. ఆ సమయంలో మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు కట్ అయి, టిక్కెట్ బుక్ కాకపోతే,’Resume/Retry’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే, IRCTC ఇప్పటికే తీసుకున్న డబ్బును గుర్తించి, అదే మొత్తంతో మళ్లీ బుకింగ్ కొనసాగించేలా చేస్తుంది. ఈ విధానంలో మళ్లీ చెల్లింపు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఫీచర్ వల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవుతుంది. మళ్లీ మొదటి నుంచి ట్రైన్ సెర్చ్ చేయడం, ప్రయాణికుల వివరాలు ఎంటర్ చేయడం లాంటి ప్రాసెస్ అవసరం లేదు. ముఖ్యంగా తత్కాల్, అత్యవసర బుకింగ్స్ లో ఇది చాలా ఉపయోగపడుతుంది.
అయితే, ఈ ఫీచర్‌కు కొన్ని షరతులు కూడా ఉన్నాయి. మొదటగా, ఇది iPay గేట్‌వే ఉపయోగించినప్పుడు మాత్రమే పని చేస్తుంది. ఇతర బ్యాంక్ గేట్ వేలు, వాలెట్ల ద్వారా చేసిన చెల్లింపులకు ఇది వర్తించదు. అలాగే, మీరు మళ్లీ బుక్ చేసే టిక్కెట్ మొత్తం, ముందుగా కట్ అయిన మొత్తంతో సమానంగా ఉండాలి. మొత్తం మారితే ఈ ఫీచర్ పని చేయదు. ఒకవేళ మళ్లీ ప్రయత్నించినా టిక్కెట్ బుక్ కాకపోతే, ఆ డబ్బు మీ బ్యాంక్ ఖాతాకు తిరిగి జమ అవుతుంది. కాబట్టి డబ్బు కోల్పోయే ప్రమాదం ఉండదు. IRCTC తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ ప్రయాణికులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చెల్లింపు సమస్యల వల్ల టిక్కెట్ మిస్ అవ్వకుండా కాపాడటమే కాకుండా, బుకింగ్ ప్రక్రియను మరింత ఈజీగా మార్చుతుంది. తరచూ రైలు ప్రయాణం చేసే వారికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది.
Read Also: సికింద్రాబాద్ – వైజాగ్ వందే భారత్‌కు ఇంత డిమాండా? దేశంలో ఏ స్థానంలో నిలిచిందంటే?