World Traffic System: ప్రపంచంలోని ప్రతి దేశంలో ట్రాఫిక్ నియమాలు ఒకేలా ఉండవు. భారత్, యునైటెడ్ కింగ్‌డమ్, జపాన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో వాహనాలు రహదారికి ఎడమవైపున నడుస్తాయి. మరోవైపు అమెరికా, ఫ్రాన్స్, చైనా, జర్మనీతో పాటు చాలా యూరోపియన్ దేశాల్లో వాహనాలు కుడివైపున ప్రయాణిస్తాయి. అయితే, ఇలా రెండు విధాలుగా ట్రాఫిక్ వ్యవస్థలు ఎందుకు ఏర్పడ్డాయనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. దీనికి కారణం కార్లు కాదు, శతాబ్దాల నాటి చరిత్ర.
ప్రాచీన కాలంలో చాలా మంది కుడిచేతి వాటం కలిగిన వారే. అందువల్ల గుర్రంపై ప్రయాణించినా, కాలినడకన వెళ్లినా ఎదురుగా వచ్చే వ్యక్తిని పలకరించడానికి, అవసరమైతే ఆత్మరక్షణ కోసం కుడి చేతిని సులభంగా ఉపయోగించేందుకు ఎడమవైపు ప్రయాణించడం అలవాటుగా ఉండేది. రోమన్ సామ్రాజ్యంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఎడమవైపు ప్రయాణించినట్లు ఆధారాలు లభించాయి. కాలక్రమేణా యూరప్‌లో పరిస్థితులు మారాయి. 18వ శతాబ్దంలో జరిగిన ఫ్రెంచ్ విప్లవం తర్వాత ఫ్రాన్స్‌లో కుడివైపు ప్రయాణం ఎక్కువగా అమల్లోకి వచ్చింది. అనంతరం నెపోలియన్ బోనపార్టే తన ఆధీనంలోని అనేక యూరోపియన్ దేశాల్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేశాడు. దీంతో కుడివైపు ట్రాఫిక్ వ్యవస్థ యూరప్ లో వ్యాపించింది. నేటికీ చాలా యూరోపియన్ దేశాలు అదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి.
అయితే, బ్రిటన్ మాత్రం తన పాత సంప్రదాయాన్ని మార్చలేదు. అక్కడ ఎడమవైపు ప్రయాణించే విధానం చాలా కాలంగా అమల్లో ఉండేది. 1835లో వచ్చిన హైవే చట్టం ద్వారా రహదారులపై అన్ని వాహనాలు ఎడమవైపునే నడవాలని అధికారికంగా నిర్ణయించారు. తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించడంతో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా లాంటి అనేక బ్రిటిష్ కాలనీలు కూడా ఇదే విధానాన్ని అనుసరించాయి.
భారత్ లో ఇప్పటికీ ఎడమవైపు వాహనాలు నడవడానికి ఇదే ప్రధాన కారణం. బ్రిటిష్ పాలనలో ఏర్పడిన ట్రాఫిక్ వ్యవస్థ స్వాతంత్ర్యం తర్వాత కూడా అలాగే కొనసాగింది. మొత్తం రహదారి వ్యవస్థను మార్చడం చాలా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో పాత విధానాన్నే కొనసాగించారు. ప్రస్తుతం ప్రపంచంలో ఎడమవైపు ట్రాఫిక్ ఉండే అతిపెద్ద దేశాల్లో భారత్ ఒకటి.
అమెరికాలో మాత్రం భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. గతంలో అక్కడ పెద్ద గుర్రపు బండ్లను నడిపే వారు సాధారణంగా ఎడమవైపు కూర్చుని కుడి చేతితో పగ్గాలు పట్టేవారు. ఎదురుగా వచ్చే వాహనాలను సులభంగా గమనించేందుకు కుడివైపు ప్రయాణించడం వారికి అనుకూలంగా ఉండేది. తర్వాత కార్లు వచ్చినా అదే విధానం కొనసాగింది. అందుకే అమెరికాలో స్టీరింగ్ వీల్ ఎడమవైపు ఉండే వాహనాలు, కుడివైపు ట్రాఫిక్ వ్యవస్థ అమల్లో ఉన్నాయి.
ప్రస్తుత కార్ల తయారీ కూడా ఆయా దేశాల ట్రాఫిక్ విధానానికే అనుగుణంగా ఉంటుంది. ఎడమవైపు ట్రాఫిక్ ఉన్న దేశాల్లో స్టీరింగ్ కుడివైపు ఉంటుంది. కుడివైపు ట్రాఫిక్ ఉన్న దేశాల్లో స్టీరింగ్ ఎడమవైపు ఉంటుంది. దీంతో డ్రైవర్ రహదారి మధ్య భాగాన్ని స్పష్టంగా గమనించగలుగుతాడు. ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు మూడింట రెండు వంతుల దేశాలు కుడివైపు ట్రాఫిక్‌ను అనుసరిస్తుండగా, మూడింట ఒక వంతు దేశాలు మాత్రమే ఎడమవైపు ట్రాఫిక్‌ను పాటిస్తున్నాయి. అయితే భారతదేశం, జపాన్ వంటి అధిక జనాభా ఉన్న దేశాలు ఎడమవైపు ట్రాఫిక్‌ను కొనసాగిస్తున్నాయి.
Read Also: హెల్మెట్ కొంటే సరిపోదు.. 2-2-2 రూల్ పాటించకపోతే ప్రాణాలను రిస్క్ లో పెట్టినట్టే!