Space Tourism: భూమి మీద నుంచి ఆకాశం వైపు చూడటం వేరు.. అదే అంతరిక్షంలోకి వెళ్లి మన గ్రహాన్ని తిరిగి చూడటం వేరు. కిటికీలోంచి చూస్తే మేఘాల మధ్య నీలిరంగులో మెరిసిపోతున్న భూమి.. చుట్టూ అంతులేని నిశ్శబ్దం.. కొన్ని క్షణాల పాటు గురుత్వాకర్షణ లేకుండా గాల్లో తేలుతున్న అనుభూతి. వినడానికే ఏదో కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్టుగా అనిపిస్తోంది కదూ. ఇలాంటి అనుభవం కోసం ఒకప్పుడు వ్యోమగాములు కావాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది.
ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు స్పేస్ టూరిజాన్ని నిజం చేయడంతో, డబ్బు ఖర్చు చేయగలిగినవారికి భూమిని అంతరిక్షం నుంచి చూసే అవకాశం లభిస్తోంది. అయితే ఇదేమీ సాధారణ టూర్ కాదు.. టికెట్ ధర లక్షల్లో ఉంటుందా, కోట్లలో ఉంటుందా? అంతరిక్షంలోకి వెళ్లాలంటే ఎలాంటి శిక్షణ తీసుకోవాలి? అసలు మనం కూడా ఎప్పుడైనా ఈ ప్రయాణం చేయగలమా? ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ తెలుసుకుందాం రండి..
అంతరిక్షంలోకి టూరిస్టులుగా వెళ్లడం పూర్తిగా సాధ్యమే. ఇప్పటికే బ్లూ ఆరిజిన్, వర్జిన్ గెలాక్టిక్, స్పేస్ ఎక్స్ లాంటి ప్రైవేట్ సంస్థలు చాలా మందిని అంతరిక్షం అంచులకు తీసుకెళ్లొచ్చాయి. భూమికి వంద కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కర్మన్ రేఖ దాటి వెళ్లి అక్కడ కొద్దిసేపు గురుత్వాకర్షణ శక్తి లేకుండా తేలియాడుతూ భూమి అందాలను చూసి రావచ్చు. ఇదంతా కొద్ది నిమిషాల నుంచి కొన్ని రోజుల పాటు సాగే అద్భుతమైన ప్రయాణం.
Also Read: ఇంటర్నెట్ లేకపోయినా.. BSNL బ్యాలెన్స్, వ్యాలిడిటీ క్షణాల్లో తెలుసుకోండిలా!
ఈ ప్రయాణానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. వర్జిన్ గెలాక్టిక్ లేదా బ్లూ ఆరిజిన్ ద్వారా భూమికి ఆవలికి వెళ్లి రావడానికి సుమారుగా రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు లేదా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లే స్పేస్ ఎక్స్ ప్రయాణాలు అయితే వందల కోట్ల రూపాయల వరకు ఉంటాయి. అందువల్ల ఇది ప్రస్తుతం కేవలం కోటీశ్వరులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఒక విలాసవంతమైన ప్రయాణం అని చెప్పవచ్చు.
అంతరిక్షంలోకి వెళ్లే ముందు టూరిస్టులకు కొన్ని రోజుల పాటు కఠినమైన శిక్షణ ఇస్తారు. రాకెట్ ప్రయాణ సమయంలో శరీరానికి తగిలే భారీ ఒత్తిడిని తట్టుకోవడం ఎలాగో నేర్పిస్తారు. అలాగే అక్కడ గురుత్వాకర్షణ లేని వాతావరణంలో ఎలా బతకాలో, భద్రతా ప్రమాణాలు ఎలా పాటించాలో శాస్త్రవేత్తలు వివరిస్తారు. ఈ శిక్షణ సాధారణంగా ప్రయాణానికి కొన్ని రోజుల ముందే ఆయా కంపెనీల శిక్షణా కేంద్రాల్లో జరుగుతుంది.
ప్రస్తుతానికైతే ఈ అంతరిక్ష ప్రయాణాలు చాలా ఖరీదైనవే. అయితే సాంకేతికత వేగంగా మారుతున్న కొద్దీ ప్రయాణ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. ఎక్కువ ప్రైవేట్ కంపెనీలు ఈ రంగంలోకి వస్తుండటంతో పోటీ పెరుగుతుంది. రాబోయే రోజుల్లో సాధారణ మధ్యతరగతి ప్రజలు కూడా అంతరిక్షంలోకి వెళ్లి భూమిని చూసి వచ్చే రోజులు కచ్చితంగా వస్తాయని నిపుణులు నమ్ముతున్నారు. అంతరిక్ష పర్యాటకం అనేది ఇప్పటివరకు కేవలం ఊహ మాత్రమే కాదు. కాస్త డబ్బు ఉంటే చాలు, నక్షత్రాల మధ్యకు వెళ్లి భూమిని కళ్లారా చూసి వచ్చే అద్భుతమైన అవకాశం ఇది.
Also Read: కనిపించకుండా పోయిన వస్తువులను ఇట్టే వెతికి పట్టుకోవచ్చు.. శాంసంగ్ నుంచి క్రేజీ డివైజ్!