Childfree vs Childless| పెళ్లయిందంటే చాలు.. బంధువుల నుంచి ఎదురయ్యే మొదటి ప్రశ్న.. “ఏమైనా గుడ్ న్యూస్ ఉందా? ఫ్యామిలీ ప్లానింగ్, ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించారా?” అని. కొందరికి పిల్లలను కనడం జీవితంలో అత్యంత సంతోషకరమైన విషయం. మరికొందరు తమ కెరీర్, వ్యక్తిగత లక్ష్యాలు, స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తూ పిల్లలు వద్దని నిర్ణయించుకుంటారు. అయితే, పిల్లలు వద్దనుకునే జంటలను సమాజం కొన్నిసార్లు స్వార్థపరులుగా చూస్తుంది. కానీ పిల్లలు లేకుండా జీవించాలనుకోవడం నిజంగా స్వార్థమేనా? ఈ విషయంపై అధ్యయనాలు జరిగాయి. చైల్డ్ ఫ్రీ, చైల్డ్ లెస్ మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం.
భారతీయ సమాజంలో పెళ్లి తర్వాత పిల్లలను కనడం సహజంగా తదుపరి అడుగుగా భావిస్తారు. ఈ సంప్రదాయాన్ని అనుసరించని దంపతులకు తరచూ ప్రశ్నలు, విమర్శలు ఎదురవుతుంటాయి. అయితే, పిల్లలు వద్దని నిర్ణయించుకున్నంత మాత్రాన వారికి ప్రేమ, బాధ్యత లేదా మానసిక సంతృప్తి లేవని అర్థం కాదు. పిల్లలు ఉన్నవారిలాగే పిల్లలు లేని వారు కూడా సంతోషంగా, సంతృప్తిగా జీవించగలరని అధ్యయనాలు సూచిస్తున్నాయి. పిల్లలు లేని జంటలు భవిష్యత్తులో తప్పకుండా తమ నిర్ణయంపై పశ్చాత్తాపపడతారనుకోవడం కూడా సరైనది కాదు. ప్రతి ఒక్కరి ఆలోచనలు, పరిస్థితులు భిన్నంగా ఉంటాయి.
2022లో ప్రచురితమైన ఒక సమీక్షలో పిల్లలు లేకుండా జీవించాలని ఎంచుకున్న వ్యక్తులకు సంబంధించిన 15 అధ్యయనాలను పరిశీలించారు. పిల్లలు లేకపోవడం వల్ల తప్పనిసరిగా సంతోషం లేదా జీవిత సంతృప్తి తగ్గుతుందని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లభించలేదు. అంటే, జీవితానికి అర్థం ఉండాలంటే తప్పనిసరిగా తల్లిదండ్రులు కావాల్సిన అవసరం లేదని ఈ పరిశోధన సూచిస్తోంది. అయితే, అందరూ పిల్లలు వద్దనే నిర్ణయం తీసుకోవాలని దీని అర్థం కాదు. వ్యక్తిగత అభిరుచులను గౌరవించడం ముఖ్యం.
చైల్డ్ ఫ్రీ : పిల్లలు లేని వారు, భవిష్యత్తులో కూడా పిల్లలను కనాలని లేదా పెంచాలని కోరుకోని వ్యక్తులను ఈ పదంతో సూచిస్తారు. వ్యక్తిగత విలువలు, కెరీర్ లేదా జీవనశైలి వంటి కారణాలతో వారు ఈ నిర్ణయం తీసుకోవచ్చు.
చైల్డ్ లెస్: పిల్లలు లేని పరిస్థితిలో ఉన్నప్పటికీ, పిల్లలు కావాలని కోరుకునే వ్యక్తులను సాధారణంగా ఈ పదంతో సూచిస్తారు. సంతానలేమి, వైద్యపరమైన సమస్యలు లేదా ఇతర పరిస్థితులు వారి కోరికకు అడ్డంకిగా మారవచ్చు.
ఈ రెండు పదాల మధ్య తేడాను అర్థం చేసుకోవడం వల్ల ఇతరుల జీవితాలపై అనవసరమైన అభిప్రాయాలు చెప్పడం నివారించవచ్చు.
Also Read: రోజంతా పనిచేసి అలసటగా ఉన్నా నిద్రపట్టడం లేదా? ఈ సింపుల్ చిట్కాతో సమస్యకు చెక్
సైకాలజీ నిపుణులు ఎడ్వర్డ్ డెసీ, రిచర్డ్ ర్యాన్ అభివృద్ధి చేసిన సెల్ఫ్ డిటర్మినేషన్ థియరీ ప్రకారం.. వ్యక్తులు తమ విలువలు, లక్ష్యాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మెరుగైన మానసిక సంతృప్తిని పొందవచ్చు. కొందరికి పిల్లలను పెంచడంలో సంతోషం దొరికితే, మరికొందరికి కెరీర్, ప్రయాణాలు, క్రియేటివిటీ లేదా వ్యక్తిగత ఎదుగుదలలో సంతోషం లభిస్తుంది.
Also Read: 52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?
పిల్లలను కనాలా వద్దా అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. పిల్లలు ఉన్నవారైనా, పిల్లలు వద్దని ఎంచుకున్నవారైనా, పిల్లల కోసం ప్రయత్నిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారైనా గౌరవానికి అర్హులే. ఇతరుల జీవిత నిర్ణయాలను విమర్శించే బదులు, వారి పరిస్థితులను అర్థం చేసుకోవడం ముఖ్యం.