Avatar Like Glowing Plants: సాధారణంగా మొక్కలు పగటిపూట సూర్యకాంతితో పెరుగుతాయి. కానీ, రాత్రి వేళల్లో అవే స్వయంగా వెలుగులు వెదజల్లితే ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు సినిమాల్లో మాత్రమే చూసిన దృశ్యాలు.. ఇప్పుడు నిజం కాబోతున్నాయి. అలాంటి అద్భుతాన్ని నిజం చేసే దిశగా చైనా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. కరెంటు అవసరం లేకుండా, కేవలం నీరు, పోషకాల సాయంతో రాత్రిపూట వెలిగే ప్రత్యేక మొక్కలను అభివృద్ధి చేస్తున్నారు.
ఈ పరిశోధన ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా హాలీవుడ్‌లో వచ్చిన ‘అవతార్’ సినిమాలో కనిపించిన వెలిగే అడవులను గుర్తు చేసేలా ఈ మొక్కలు ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ కొత్త సాంకేతికతకు బయోల్యూమినిసెంట్ టెక్నాలజీ అని పేరు పెట్టారు. ఇందులో సహజంగా వెలుగు ఇచ్చే జీవుల నుంచి ప్రత్యేక జన్యువులను తీసుకుని మొక్కల్లో ప్రవేశపెడతారు. చైనాలోని మ్యాజిక్ పెన్ బయో సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు మిణుగురు పురుగులు, కొన్ని ప్రత్యేక శిలీంద్రాల నుంచి వెలుగును ఉత్పత్తి చేసే జన్యువులను గుర్తించారు. ఆ జన్యువులను మొక్కల కణాల్లో ప్రవేశపెట్టడం ద్వారా అవి చీకట్లో కాంతిని విడుదల చేసేలా చేశారు.
ఈ ప్రయోగంలో ఇప్పటి వరకు 20కిపైగా రకాల మొక్కలను విజయవంతంగా మార్చారు. ఆర్కిడ్లు, పొద్దుతిరుగుడు పూలు, చామంతి లాంటి మొక్కలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ మొక్కలు రాత్రి సమయంలో సహజంగా కాంతిని వెదజల్లాయి. ఇక మరో పరిశోధనలో, సౌత్ చైనా అగ్రికల్చరల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మరో కొత్త పద్ధతిని అభివృద్ధి చేశారు. వారు మొక్కల ఆకుల్లో ప్రత్యేకమైన ఫాస్ఫర్ నానోపార్టికల్స్ ప్రవేశపెట్టారు. ఇవి పగటిపూట సూర్యకాంతిని గ్రహించి నిల్వ చేసుకుంటాయి. తర్వాత రాత్రి వేళల్లో నీలం, ఆకుపచ్చ వంటి అందమైన రంగుల్లో వెలుగును విడుదల చేస్తాయి. ముఖ్యంగా సక్యూలెంట్ మొక్కలపై ఈ ప్రయోగాలు మంచి ఫలితాలను ఇచ్చాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో అనేక రంగాల్లో ఉపయోగపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా సిటీల్లో స్ట్రీట్ లైట్స్ కు అవసరమయ్యే విద్యుత్ వినియోగాన్ని కొంతవరకు తగ్గించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, పార్కులు, పర్యాటక ప్రాంతాల్లో సహజ కాంతితో మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడొచ్చని చెబుతున్నారు. అయితే, ఈ సాంకేతికత ఇంకా పరిశోధన దశలోనే ఉంది. సాధారణ ప్రజలకు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ, ప్రకృతిని సాంకేతికతతో కలిపి కొత్త అవకాశాలను సృష్టించే ఈ ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో రాత్రిళ్లు స్వయంగా వెలిగే మొక్కలు ఇళ్లలో, పార్కుల్లో కనిపించే రోజులు రావచ్చని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!