Telugu Serials Logic: సీరియల్స్ ..వీటికి ఫ్యామిలీస్ కి చాలా దగ్గరి కనెక్షన్ ఉంటుంది. ఆరు అరవై అయినా,నూరు మున్నూరు అయినా ఆ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవాల్సిందే.
అందుకే ఎన్ని సీరియల్స్ వచ్చిన ఇలాంటి మహారాజపోషకుల అండ దండలతో అడ్డుఅదుపు లేకుండా సాగిపోతూనే ఉన్నాయి.మనం వీటిల్లో మునిగిపోయి కాస్త లాజిక్ కి దూరంగా జరిగిపోతాం కాని ఆ సీరియల్స్ లో జరిగే వింతలు చూస్తే అసలు నిజంగానే ఇలా జరుగుతుందా అని కాసింత మైండ్ పెట్టి ఆలోచిస్తే మాత్రం ఇలా కూడా జరుగుతుందా అని తలని పట్టుకోవడం పక్కా.
సీరియల్ లో జరిగే ఆ వింతల సంగతికి వస్తే..సీరియల్ లో ఏదైనా సీరియస్ టాపిక్ మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి చాటుగా ఒక బ్యాచ్ రెడీగా ఉంటుంది.అసలు పని పాట లేకుండా వాళ్ళందరూ ఒకే దగ్గర అలా ఎందుకు ఉంటారో అర్థం కాదు. పోనీ అది అక్కడిదో ఆగుతుందా అంటే లేదు..ఈ గల్లీలో ఉన్న పాన్ డబ్బా వాడికి చేరేదాకా చర్చలు సాగుతూనే ఉంటాయి.కానీ ఇక్కడ మ్యాజిక్ ఒకటి ఉందండోయ్…అవును ..మాట్లాడుకున్న ఆ విషయం ఊరు మొత్తం తెల్సిపోతుంది కాని చేరాల్సిన వాడి వద్దకి మాత్రం అంత ఈజీగా చేరదు.
ఇక మాములుగా మన ఇళ్ళల్లో ఎవరైనా పడిపోతే ఏం చేస్తాం.వెంటనే వారిని లేపి కూర్చోబెట్టి సపర్యలు చేస్తాం.కానీ ఈ సీరియల్స్ లో ఎవరైనా పడిపోతే వాళ్ళని పట్టించుకునే దిక్కు దివాణం ఉండదు.పోనీ ఎవరైనా పట్టించుకున్నా అది మూడు రోజుల తర్వాతే.
ఇక మెడికల్ హిస్టరీ లో ఎప్పుడు చూడని అధ్బుతాలన్ని ఈ సీరియల్స్ లోనే కనిపిస్తాయి.ఎలా అంటారా ..వాడు మతితప్పి స్పృహ కోల్పోయి ఏళ్ళు గడిచినప్పటికీ ఎప్పుడూ గుర్తుకు రాని గతం మెడలో వేసుకున్న దండ వల్లో, లేక అరిగి చిరిగిన ఫోటో వల్లో అమాంతం గుర్తుకు వచ్చేస్తుంది.
ఇక ఈ సీరియల్స్ లలో మొహాలపై పడే షాకింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.ముఖ్యంగా ఎవరైనా ఒక షాకింగ్ న్యూస్ (అని వాళ్ళు అనుకుంటారు)చెబితే అక్కడున్న వారందరి మొహాల మీద పడే సౌండ్ ఎఫెక్ట్స్ ,వాటికి తోడు వాళ్ళు విచిత్రమైన రియాక్షన్స్ నెవర్ బిఫోర్.ఇక ఒకసారి సరిపోదని మూడు,నాలుగేసి సార్లు రియాక్ట్ అవ్వడం ఇక్కడ చాలా కామన్.అదే మన రియల్ లైఫ్ లో రియాక్షన్ ఇచ్చే లోపే బయటపడిపోతాం.
ఇక సీరియల్స్ లో హీరో హీరోయిన్స్ ఎప్పుడైనా సీక్రెట్ గా మాట్లాకుంటుంటే సరిగ్గా అదే సమయానికి ఎంట్రీ ఇస్తాడు విలన్. మరి అంత కరెక్ట్ గా వాడికి ఆ లొకేషన్ ఎవరు షేర్ చేస్తారో.కొంపదీసి వాడే ఆ జోడీకి gps సెట్ చేస్తాడేమో.
ఇక సీరియల్స్ లలో పెళ్ళిళ్ళు జరిగే తీరు చాలా కామెడీగా ఉంటుంది. పెళ్లి జరుగుతుందన్న మాటే కాని పెళ్లి కొడుకు తాళి కట్టే సమయానికి ఖచ్చితంగా ఈ పెళ్లిని ఎవరో ఒకరు ఆపేస్తారు అని పక్కాగా ఆడియన్స్ ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఇక ఆ పెళ్లి జరగాలంటే దేవుళ్ళు దిగిరావాల్సిందే.
ఇక మనం ఎవరితోనైనా మాట్లాడాలి అనుకుంటే ఫోన్ అందుకుని నిమిషాలలో అసలు విషయం ఏంటనేది తేల్చేస్తాం.కానీ సీరియల్స్ లో ఏదైనా విషయం హీరోకి చెప్పాలంటే హీరోయిన్ కి మినిమం పది ఎపిసోడ్లు పడుతుంది.
ALSO READ:రజినీ జైలర్ 2 కథ ఇదేనా? ఈసారి టార్గెట్ ఎవరో తెలిస్తే షాక్!
మరో వైపు ఏదైనా సీరియస్ మ్యాటర్ ఎవరికైనా చెప్పాలంటే కిలోమీటర్ల కొద్ది నడుస్తారు తప్ప చేతిలో ఉన్న ఫోన్ ని తీసి లొకేషన్ షేర్ చేసే ఆప్షన్ అస్సలు వాడరు. ఇలా ఒకటి రెండు కాదు ఎన్నో వింతలు మనకి సీరియల్స్ లో కనిపిస్తూ ఉంటాయి.అయినా మనం ఇవేమీ పట్టించుకోకుండా విరగబడి చూసేస్తాం చూడండి ..అదే వాటికున్న మ్యాజిక్కు.