CM Chandrababu latest comments(AP news live): తిరుమల నుంచి ప్రక్షాళన మొదలవుతుందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. గత పాలనలో తిరుమల అవినీతిమయంగా మారిందన్నారు. అక్కడ అపవిత్రం చేయడం సరికాదన్నారు. తిరుమలలో ఓం నమో వెంకటేశాయ అనే నినాదం తప్ప, మరొకటి ఉండటానికి వీల్లేదన్నారు. గత ఐదేళ్ల పాలనలో ఏపీ నాశనమైందని, 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు.
కక్ష సాధింపు ఉండకూడదన్నారు ముఖ్యమంత్రి. తిరుమలలో అన్యమత ప్రచారం, లిక్కర్, నాన్ వెజిటేరియన్ వాటికి కేరాఫ్‌గా మారిందన్నారు. అంతేకాదు చివరకు పైరవీలకు కేంద్రంగా తిరుమల తయారైందన్నారు. పదవుల ద్వారా కోర్టు కేసుల నుంచి లబ్దిపొందాలని చూస్తున్నారని ప్రత్యర్థులకు చురక అంటించారు. దేవుడికి అపచారం చేసినవారు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారని, గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని గుర్తు చేశారు.
వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎన్నికల్లో ఘన విజయం సాధించామన్నారు సీఎం చంద్రబాబు. తన కుటుంబానికి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయాల ముసుగులో నేరాలు చేస్తామంటే కుదరదని సున్నితంగా ప్రత్యర్థులను హెచ్చరించారు. పరదాలు కట్టే పరిస్థితి ఇంకా ఉండడం దారుణ మన్నారు. ఇలాంటి కల్చర్ చూస్తుంటే బాధేస్తుందన్నారు.
ఎన్నో ఎన్నికలు చూశామని, ఇదొక చరిత్రాత్మక విజయమన్నారు సీఎం చంద్రబాబు. కుటుంబసభ్యులతో కలిసి గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర చరిత్రలో 93 శాతం స్ట్రైకింగ్ రేట్‌తో ఎప్పుడూ విజయం సాధించలేదన్నారు. తిరుమలలో అన్నదానం తీసుకొచ్చింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మారుస్తానన్నారు. గతంలో తనను వెంకటేశ్వరుడు బతికించారన్నారు. మా కుల దైవం వెంకటేశ్వరస్వామి అని, ఆయన దగ్గర సంకల్పం చేసి ఏ కార్యక్రమమైనా మొదలు పెడతానన్నారు.
ALSO READ: శ్రీవారి సన్నిధిలో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ, ప్రోటోకాల్, పరదాల విషయంలో..
ఏపీలో ఇవాళ్టి నుంచే ప్రజా పాలన మొదలైందన్నారు ముఖ్యమంత్రి. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందిపడ్డారని గుర్తు చేశారు. 2047నాటికి ప్రపంచంలో దేశం ఫస్ట్ లేదా సెకండ్ ప్లేస్‌లో ఉందన్నారు. ఏపీ, తెలంగాణ బాగుండాలన్నారు. అందులో ఏపీ మొదటి స్థానంలో ఉండాలన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత తిరుమల వచ్చి మీడియాతో మాట్లాడారు.