Chevireddy Bhaskar: రాష్ట్రంలో ఉద్రిక్త రాజకీయ పరిస్థితుల నడుమ తిరుపతి వేదికగా వైఎస్సార్‌సీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశం తీవ్ర కలకలం రేపింది. పోలీసులతో పాటు ఎన్నికల అధికారుల తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. స్పాన్సర్డ్ గూండాయిజాన్ని ప్రోత్సహించడం సివిల్ సర్వీసులకే మచ్చ తెచ్చేలా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులే స్వయంగా దౌర్జన్యాలను ప్రోత్సహిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని, అసలు ఎవరి కళ్లల్లో ఆనందం చూడటానికి వీరంతా ఈ స్థాయిలో తాపత్రయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.
అధికారం శాశ్వతం కాదు.. మూల్యం తప్పదు!
రాజకీయాల్లో అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని చెవిరెడ్డి హెచ్చరించారు. బాధితులైన వ్యక్తి ఆ ఘటనను జీవితాంతం మర్చిపోరని, కానీ అధికారులు ఎవరి కోసమైతే ఈ తప్పులు చేశారో.. ఆ నాయకులు పది రోజుల్లోనే మర్చిపోతారని వ్యాఖ్యానించారు. తిరుపతి, చిత్తూరు, కడప, పల్నాడు జిల్లాల్లో కొందరు ఎస్పీలతో పాటు డీఐజీ కోయ ప్రవీణ్, సుమారు 20 మంది ఏఎస్పీలు, డీఎస్పీలు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు విచ్చలవిడిగా వ్యవహరిస్తే భవిష్యత్తులో పశ్చాత్తాపపడినా వదిలిపెట్టేది లేదని, ఈ వ్యవహారశైలి వారి ఉద్యోగ భవిష్యత్తుకు అస్సలు మంచిది కాదని స్పష్టం చేశారు. గతంలో ఏకపక్షంగా వ్యవహరించిన 12 మంది అధికారులు నేడు పెన్షన్ కోసం కూడా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తుచేశారు.
తమిళనాడు గూండాలు.. న్యాయపోరాటానికి సిద్ధం!
రాష్ట్రంలోని గ్రామాల్లో, హోటళ్లలో తమిళనాడుకు చెందిన కిరాయి గూండాలు తిరుగుతున్నారని, వైసీపీ నేతలు నామినేషన్లు వేస్తే దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెవిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నామినేషన్ వేయడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని, దాన్ని స్వేచ్ఛగా వినియోగించుకునే వాతావరణం కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారులు చేసిన అక్రమాలపై సాక్ష్యాధారాలతో కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తామని తేల్చిచెప్పారు.
Also Read: హైదరాబాద్‌లో నకిలీ నెంబర్ ప్లేట్లపై ఉక్కుపాదం.. 100 కేసులు, వాహనాలు సీజ్!