Fake Number plates: స్వేచ్ఛ బ్యూరో: నకిలీ నెంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. విస్తృతస్థాయిలో తనిఖీలు నిర్వహించి వంద వాహనాలను సీజ్ చేసి వాటిని నడుపుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవటం, చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించడం కోసం పలువురు నకిలీ నంబర్ ప్లేట్లను ఉపయోగిస్తున్నారన్న ఫిర్యాదులు అధికమైన నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఈ స్పెషల్ డ్రైవ్ జరిపారు.
88 ద్విచక్ర వాహనాలు, 12 కార్లను సీజ్
ఎనిమిది నెలల్లో వంద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. 88 ద్విచక్ర వాహనాలు, 12 కార్లను సీజ్ చేశారు. నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లను ఉపయోగించడం తీవ్రమైన చట్ట ఉల్లంఘన మాత్రమే కాకుండా ట్రాఫిక్ నిర్వహణకు, నేర నియంత్రణకు, ప్రజల భద్రతకు పెద్ద సవాలుగా మారిందని అదనపు సీపీ (ట్రాఫిక్) జోయల్ డేవిస్ తెలిపారు. 1988 మోటారు వాహనాల చట్టం, 1989 సెంట్రల్ మోటారు వాహనాల నిబంధనలు ప్రకారం, ప్రస్తుతం అమల్లో ఉన్న హెచ్ఎస్ఆర్పీ నిబంధనల ప్రకారం ప్రతీ వాహనదారుడు తమ నంబర్ ప్లేట్లను అమర్చుకోవాలని స్పష్టం చేశారు.
అధికారుల సూచన..
నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లు, మార్చిన అంకెలు, అనధికార ఫాంట్లు, అలంకార అక్షరాలు, స్టిక్కర్లు, అసలు రిజిస్ట్రేషన్ నంబర్ ను దాచేలా, తప్పుగా చూపించేలా చేసే ఎలాంటి మార్పులైనా చట్టరీత్యా నిషేధమని చెప్పారు. నకిలీ, టాంపర్ చేసిన నంబర్ ప్లేట్లపై ఇకముందు కూడా తనిఖీలు కొనసాగుతాయన్నారు. వాహనదారులందరూ నిర్దేశించిన రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, ఎలాంటి అనధికారిక మార్పులు చేయవద్దని సూచించారు.
Also Read: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులపై భట్టి సంచలన ఆదేశాలు.. వెనుకబడిన శాఖలపై ఫోకస్!