CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికల వేళ నేతలకు మరోసారి దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. ప్రతిచోట కూటమి జెండా ఎగరాల్సిందేనని తేల్చి చెప్పారు. పార్టీల మధ్య మిత్ర ధర్మం విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని తేల్చేశారు. అసలు ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఉదయం పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక ఎన్నికలు-కూటమితో సమన్వయంపై నేతలకు దిశా నిర్దేశం చేశారు. కొన్నిచోట్ల మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నేతలు రెబెల్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. చాలామంది ఇంకా విత్ డ్రా కాలేదు. ఈ విషయంలో నేతలను సున్నితంగా హెచ్చరించారు. వైసీపీ అధినేత తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని, కుటుంబ బంధాలను పట్టించుకోరని ఈ సందర్భంగా మండిపడ్డారు.
గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమం-అభివృద్ధి-సుపరిపాలనతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. ఏకగ్రీవంగా ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు పిలుపు ఇచ్చారు. చెప్పాం-చేస్తున్నాం అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి ముమ్మరం తీసుకెళ్లాలని ఆదేశించారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ అరాచకాలకు పాల్పడిందని వివరించారు. అందువల్ల గత ఎన్నికల్లో ప్రజలు కేవలం 11 సీట్లు ఇచ్చారని తెలిపారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేశామన్నారు. ప్రతీ ప్రాంతం, వర్గానికి ప్రయోజనం చేకూర్చేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఈ విషయాలను ప్రజలకు వివరించాలని సూచన చేశారు. కూటమి కార్యకర్తలు మిత్ర ధర్మాన్ని పాటిస్తూ ప్రభుత్వానికి-ప్రజలకు వారధిగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయాలని, అప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు.
ALSO READ: ప్రకాశం జిల్లాలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి..
పొత్తులు, రిజర్వేషన్లు, సామాజిక సమీకరణాల కారణంగా అవకాశం దక్కని వారికి నామినేటెడ్ పదవుల ద్వారా గుర్తింపు ఇస్తామన్నారు. ప్రతి ఓటరు పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేసేలా చూడాలన్నారు. గత ఎన్నికల కంటే.. ప్రతి బూత్‌లో అధిక ఓట్లు సాధించాలని నేతలకు వివరించారు సీఎం చంద్రబాబు.