CM Chandrababu: రాజకీయ నేరస్తులకు పోలీసులు రక్షణ కల్పించకూడదన్నారు సీఎం చంద్రబాబు. రప్పా రప్పా అంటూ ప్రజలను ఇబ్బంది పెట్టే రౌడీల తాట తీయాలన్నారు. సోషల్ మీడియా సైకోలను వదిలి పెట్టడానికి వీల్లేదన్నారు. నేరాలను నివారించడం బెస్ట్ పోలీసింగ్‌కు నిదర్శనమన్నారు.
పోలీసుల అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం మంగళగిరిలోని ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన రకరకాల తుపాకులను ఆయన పరిశీలించారు. వినియోగిస్తున్న టెక్నాలజీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు ముఖ్యమంత్రి.
పోలీసులు అంటే ప్రజలకు భరోసా అని, ఆపదలో ఉన్నవారికి పోలీసులు ధైర్యమని అన్నారు. ప్రమాదం, నేరం జరిగినా ముందు గుర్తు వచ్చేది పోలీసులేనని అన్నారు. వారికి ఎండ, వాన, పండుగ, పగలు, రాత్రిళ్లు లేకుండా విధుల్లో ఉండి సేవ చేసే ఒకే ఒక్క విభాగం అది పోలీసు శాఖ అని అన్నారు. పోలీసుల వద్దకు వచ్చే ప్రతీ వ్యక్తి తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశతో వస్తారన్నారు. కొందరు భయంతో, మరికొందరు కన్నీళ్లతో వస్తారన్నారు. వారి సమస్యలను మానవత్వంతో మనం పరిష్కరించాలన్నారు.
పోలీసు యూనిఫామ్ బాధితులకు అభయం ఇచ్చేలా ఉండాలన్నారు. మీ దగ్గరకు వచ్చేవారికి గౌరవం దక్కాలన్నారు. మీ నుంచి వచ్చే స్పందన వారికి నమ్మకాన్ని కలిగించాలన్నారు. అంతిమ ఫలితం పోలీసు శాఖ ప్రతిష్టత పెంచాలన్నారు. ఖాకీని చూస్తే నేరస్తుడికి భయం కలగాలన్నారు. నేరం చేసే పద్దతి మారిందని, దర్యాప్తు చేస్తే పద్దతి మారాలన్నారు.
ALSO READ: పెద్దిరెడ్డి, రోజాల కోటల్లో వైసీపీకి బిగ్ షాక్.. పీఠాలన్నీ టీడీపీ ఖాతాలోనే!
దేశ రక్షణకు భంగం కలిగే చర్యలను ఏపీ పోలీసు వ్యవస్థ అడ్డుకుందన్నారు. భద్రతపై నమ్మకం ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని, పోలీసులు ఉంటేనే సమాజంలో శాంతిభద్రతలు సాధ్యమవుతుందన్నారు. తాను ఎప్పుడు అధికారంలో ఉన్నా, తొలుల శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఏపీ పోలీసులంటే టెక్నాలజీలో టాప్ అని దేశమంతా అనుకోవాలని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు.