Weather Alert: ఎల్‌నినో కారణంగా దక్షిణాది రాష్ట్రాలపై వరుణుడు ముఖం చాటేస్తున్నాడు. తుఫాను ఏర్పడినప్పటికీ గాల్లోనే తేలిపోతోంది. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరి ఈసారైనా వర్షాలు పడతాయా? లేకుంటే ఎల్‌నినో దెబ్బకు గాల్లోనే తేలిపోతుందా?
నైరుతి బంగాళాఖాతం-ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని కారణంగా రానున్న 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. థాయిలాండ్-మయన్మార్ ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్ర పరిసరాల్లోకి ప్రవేశించింది. అక్టోబర్ 23న ఆగ్నేయ బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. అక్టోబర్ 23 తర్వాత ఏర్పడే అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ రానున్న మూడు రోజుల్లో మరింత బలపడనుంది. ఈనెల 26న వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.
ఈనెల 28న వాయుగుండం తీవ్ర తుఫానుగా బలపడి 29 లేదా 30 తేదీన ఉత్తర-కోస్తా దక్షిణ, ఒడిస్సా తీరాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉపరితల ఆవర్తనం కారణంగా విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అక్టోబర్ 21, 22న ఉరుములు- మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలుల వీస్తాయని అంచనా వేసింది. ఇక రాయలసీమ జిల్లాలైన కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పిడుగులతోపాటు వర్షాలు పడే అవకాశముందని తెలియజేసింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ తోపాటు తెలంగాణల్లో బుధవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. పలు జిల్లాల్లో ఆకాశం రోజంతా మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం మధ్య వాతావరణం చల్లబడి, ఆ తర్వాత ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్ సిటీలో బుధవారం వాతావరణం ఆహ్లాదకరమైన ఉన్నప్పటికీ, మధ్యాహ్నం తర్వాత ఆకాశం పూర్తిగా దట్టమైన మేఘాలతో కమ్ముకునే అవకాశముంది.
ALSO READ: బ్యాంకాక్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్ వెనుక అసలేం జరిగింది?
పలు ప్రాంతాల్లో సాయంత్రం-రాత్రి వేళల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. వర్షం పడే సమయంలో గాలులు గంటకు 2 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది. తెలంగాణ వ్యాప్తంగా రాగల 24 గంటల్లో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో వ్యవసాయదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.