Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. సోమవారం మహిషాసురమర్ధిని దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. రాత్రి నుంచి భవానీ భక్తులు ఇంద్రకీలాద్రికి భారీగా చేరుకున్నారు.
బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా సర్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. 9వ రోజు సోమవారం అమ్మవారు మహిషాసురమర్ధిని దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయంలో ఉదయం 4 గంటల నుండి భక్తులు క్యూ కట్టారు. అందుకోసం ఆలయ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. పెద్దఎత్తున భవానీలు తరలిరావడంతో ఎరుపెక్కింది ఇంద్రకీలాద్రి.
ఆదివారం ఒక్కరోజు రాత్రి 10 గంటలకు దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని 1,26,681 మంది భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో కుమ్మరిపాలెం సెంటర్ వద్ద గేట్లు తోసుకుంటూ ముందుకు వచ్చారు భక్తులు. భక్తుల రద్దీని అదుపు చేస్తూ పరిస్థితిని పర్యవేక్షించారు విజయవాడ సీపీ ఎస్‌వీ రాజశేఖర్‌బాబు. భక్తుల రద్దీని నియంత్రిస్తూ దర్శనానికి పంపారు పోలీసు అధికారులు. ఘాట్ రోడ్డు, గాలి గోపురం సమీపానికి కలశ దీపాలతో భారీగా తరలివచ్చారు భవానీలు.
గాలిగోపురం సమీపంలోని ఫుట్‌పాత్‌పై కలశ దీపాలు ఏర్పాటు చేశారు భక్తులు. అయితే భక్తుల దర్శనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు పోలీసు అధికారులు. అన్నప్రసాద పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయడంతోపాటు ఆలయ పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. భక్తుల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు పోలీసు సిబ్బంది అన్ని కోణాల్లో పర్యవేక్షణ చేపట్టారు.
ALSO READ: శ్రీవారి భక్తులకు గమనిక.. జనవరి నెల సేవలు, దర్శన టికెట్లు నేటి నుంచి విడుదల, వైకుంఠ ద్వార దర్శనాలు
కమాండ్ కంట్రోల్ వ్యవస్థల ద్వారా సీసీ కెమెరాల ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. క్యూలైన్లలో భక్తులు క్రమశిక్షణ పాటించేలా చర్యలు తీసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా సంబంధిత సిబ్బందిని ఆ ప్రాంతంలో మోహరించారు.