Dharmana Prasada: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత పరిణామాలు, వ్యవస్థల తీరుపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడటంలో సుప్రీంకోర్టు కల్పించుకున్న తీరును స్వాగతిస్తూ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
వ్యవస్థల విఫలంపై సుప్రీం ఆగ్రహం
చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో రాజ్యాంగ వ్యవస్థలు కూలిపోతాయని, సరిగ్గా పనిచేయవనడానికి నేటి సుప్రీంకోర్టు వ్యాఖ్యలే నిదర్శనమని ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూల్చివేస్తుంటే న్యాయస్థానాలు ఊరుకోవని ఆయన వ్యాఖ్యానించారు.
పోలీస్, ఎన్నికల కమిషన్‌ల తీరు
ఎన్నికల సమయంలో స్వతంత్రంగా వ్యవహరించాల్సిన పోలీస్ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా పనిచేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఈ వ్యవస్థలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించకపోవడం వల్లే అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్నారు. స్వేచ్ఛగా నామినేషన్లు వేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాలని పోలీసు డైరెక్టర్ జనరల్ (DGP)ని సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు.
రాజీనామాకు డిమాండ్
రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధమైన పాలన సాగుతోందని న్యాయస్థానాలే స్వయంగా గుర్తించాయని ధర్మాన పేర్కొన్నారు. ఇది కేవలం ఏదో ఒక ఎన్నికకు సంబంధించిన చిన్న విషయం కాదని, మొత్తం రాష్ట్ర పాలనా వ్యవస్థకు సంబంధించిన తీవ్రమైన అంశమని ఆయన తెలిపారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన సాగిస్తున్న నాయకులు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.
Also Read: జగన్‌లాంటి వారు రాజకీయాలకే ప్రమాదం.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు