Chandrababu Naidu: రాష్ట్రంలో అభివృద్ధిని, ఎన్నికలను అడ్డుకోవడమే ప్రతిపక్ష పార్టీ ప్రధాన ఎజెండాగా పెట్టుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమరావతి వేదికగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైకాపా నాయకులు కోర్టు తీర్పులను సైతం తమకు అనుకూలంగా వక్రీకరిస్తూ కుట్రలకు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విధ్వంసకర రాజకీయాలకు పాల్పడటమే కాకుండా, వాటిని అడ్డుకుంటే ఎన్నికలనే ఆపేందుకు కోర్టులను ఆశ్రయించడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని విమర్శించారు.
బెంగళూరులో కూర్చుని విధ్వంస రచనలు
బెంగళూరు కేంద్రంగా కుట్రలు పన్నుతూ, రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు రకరకాల పన్నాగాలకు తెరలేపుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో జగన్ లాంటి వ్యక్తులు రాజకీయాలకు పెను ప్రమాదమని హెచ్చరించారు. అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటూ, రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేలా వైకాపా నాయకులు వ్యవహరిస్తున్న తీరును ప్రజల గమనిస్తున్నారని ఆయన అన్నారు.
కూటమి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి..
ఈ నేపథ్యంలో కూటమి శ్రేణులన్నీ సమన్వయంతో ముందుకు సాగాలని సీఎం పిలుపునిచ్చారు. జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసికట్టుగా పనిచేసి కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా శ్రమించాలని స్పష్టం చేశారు. గొడ్డలి పార్టీ అరాచకాలను, వారి కుట్రపూరిత రాజకీయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి, వారి నిజస్వరూపాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
Also Read: దసరా ట్రిప్‌కి వెళ్లొచ్చేసరికి దారుణం.. కుషాయిగూడలో 30 తులాల బంగారం చోరీ!