Korean Action Thriller: ఓ దేశానికి చెందిన దౌత్యవేత్త మరో దేశంలో కిడ్నాప్‌కు గురైతే… అతడిని కాపాడే బాధ్యత ప్రభుత్వంపై పడుతుంది. కానీ యుద్ధ వాతావరణం నెలకొన్న దేశంలోకి వెళ్లి, కిడ్నాపర్లకు డబ్బు ఇచ్చి బందీని విడిపించడం అంత సులభం కాదు. పైగా అక్కడి పరిస్థితులు, రాజకీయ కుట్రలు, ప్రాణాలు తీసేందుకు వెంటపడే ముఠాలు ఎదురైతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఇలాంటి ఉత్కంఠభరితమైన ఘటనలతో తెరకెక్కిన దక్షిణ కొరియా యాక్షన్ థ్రిల్లర్ ‘రాన్సమ్డ్’ (Ransomed). మరి ఈ థ్రిల్లర్ మూవీని ఎక్కడ చూడొచ్చు ? కథ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…
1986లో లెబనాన్ రాజధాని బీరూట్ లో దక్షిణ కొరియా రాయబార కార్యాలయంలో పని చేసే ఓహ్ జే-సియోక్ ను సాయుధ వ్యక్తులు కిడ్నాప్ చేస్తారు. అతడి ఆచూకీ తెలియకపోవడంతో కొరియా ప్రభుత్వం అతడిని దాదాపుగా మర్చిపోతుంది. అయితే 20 నెలల తర్వాత విదేశాంగ శాఖలో పని చేసే లీ మిన్ – జున్ కు ఓహ్ బతికే ఉన్నాడని తెలియజేసే రహస్య సందేశం అందుతుంది.
ఆ సందేశం ఆధారంగా ఓహ్ ను కాపాడేందుకు ఓ రహస్య ఆపరేషన్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ బాధ్యతను స్వచ్ఛందంగా తీసుకున్న మిన్ – జున్ కు అమెరికాలో మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కిడ్నాపర్లకు ఐదు మిలియన్ డాలర్ల వరకు డబ్బు అందించే ప్రణాళికతో అతడు లెబనాన్ కు బయలుదేరుతాడు. కానీ అక్కడి విమానాశ్రయంలోనే అతడికి ప్రమాదం ఎదురవుతుంది. కొందరు సాయుధ వ్యక్తులు అతడిని వెంబడించడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీయాల్సి వస్తుంది.
ఆ సమయంలో అతడికి కొరియాకు చెందిన ట్యాక్సీ డ్రైవర్ కిమ్ పాన్ – సూ పరిచయమవుతాడు. లెబనాన్ లోనే స్థిరపడిన పాన్ – సూ మొదట డబ్బు సంపాదించడంపైనే దృష్టి పెడతాడు. మిన్ – జున్ తో కలిసి పని చేయడానికి అంగీకరించినా, అతడి ప్రవర్తనపై పూర్తిగా నమ్మకం కలగదు. అయినప్పటికీ స్థానిక ప్రాంతాలపై అవగాహన ఉన్న వ్యక్తి కావడంతో మిన్ – జున్ అతడి సహాయం తీసుకుంటాడు.
ఇద్దరూ కలిసి కిడ్నాపర్లను చేరుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ డబ్బును దోచుకోవాలని చూసే ముఠాలు, కాల్పులు, మోసాలు వారి ప్రయాణాన్ని మరింత ప్రమాదకరంగా మారుస్తాయి. ఒక దశలో ఓహ్ ను గుర్తించినా, అతడిని మళ్లీ కిడ్నాపర్లు తీసుకెళ్లిపోతారు. మరోవైపు పాన్ – సూ డబ్బుతో పారిపోవడంతో మిన్ – జున్ ఒంటరిగా మిగిలిపోతాడు. అయినా తన సహోద్యోగిని వదిలి పెట్టకుండా అతడిని రక్షించేందుకు పోరాడుతాడు.
అయితే ఈ ఆపరేషన్ కు దక్షిణ కొరియా ప్రభుత్వంలోని కొందరు అధికారులు అడ్డుపడుతున్నారని మిన్ – జున్ కు తెలుస్తుంది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం బందీ ప్రాణాలను కూడా పణంగా పెట్టేందుకు వారు వెనుకాడరు. చివరికి పాన్ – సూ తిరిగి మిన్ – జున్ కు సహాయం చేస్తాడు. ఇద్దరూ కలిసి ఓహ్ ను విడిపించేందుకు మరోసారి ప్రమాదకరమైన ప్రయత్నం చేస్తారు. ప్రాణాలకు తెగించి సాగించే ఈ పోరాటంలో వారి మధ్య నమ్మకం, స్నేహం ఏర్పడతాయి. చివరికి బందీని సురక్షితంగా బయటకు తీసుకురావడమే కాకుండా, మిన్ – జున్ కూడా స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు.
కిమ్ సియోంగ్ – హున్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హా జంగ్ – వూ, జూ జీ – హూన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 1980లలో లెబనాన్ లో జరిగిన దౌత్యవేత్త కిడ్నాప్ ఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. యాక్షన్ తో పాటు స్నేహం, రాజకీయ కుట్రలు, ఉత్కంఠభరితమైన రక్షణ ఆపరేషన్ ఇందులో హైలెట్ గా ఉంటాయి. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో కొరియన్ ఆడియోతో అందుబాటులో ఉంది. హిందీ ఆడియో కూడా ఉంది. తెలుగు డబ్బింగ్ లేదు. నిజ ఘటనల ఆధారంగా సాగే యాక్షన్ థ్రిల్లర్లు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చవచ్చు. కాబట్టి డోంట్ మిస్.