Nara Lokesh: విశాఖపట్నాన్ని ప్రపంచస్థాయి నగరంగా రూపుదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని విద్యుత్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ప్రకృతి సిద్ధమైన కొండలు, సుదీర్ఘ సముద్ర తీరం, రాతి కొండచరియలు విశాఖకు సహజ సిద్ధమైన బలాలని, వీటి ఆధారంగా నగరాన్ని నవ శకంలోకి తీసుకెళ్తామని ఆయన తెలిపారు.
తూర్పు తీర శాన్‌ఫ్రాన్సిస్కోగా విశాఖ
విశాఖ నగరాన్ని ‘తూర్పు తీర శాన్‌ఫ్రాన్సిస్కో’ గా మారుస్తామని లోకేశ్ ఉద్ఘాటించారు. ఒకవైపు సహజ సిద్ధమైన ప్రకృతి అందాలు, మరొకవైపు ఆధునిక టెక్నాలజీ హంగులు మేళవించడమే విశాఖకు ఉన్న ప్రత్యేకత అని చెప్పారు. నగరంలో ప్రస్తుతం సాంకేతిక రంగాలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయని, ప్రకృతి-ప్రగతి రెండూ చెయ్యి చెయ్యి కలిపి నడిచేలా సమగ్ర అభివృద్ధి ప్రణాళికను అమలు చేస్తున్నామని వివరించారు.
అంతర్జాతీయ గుర్తింపు దిశగా అడుగులు
ఇటీవల గంగవరం బీచ్ అందాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ, విశాఖ అందాలను ప్రపంచానికి పరిచయం చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు లోకేశ్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైజాగ్ అపార సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే తమ విజన్ అని పేర్కొన్నారు.
విశాఖపట్నం అంతర్జాతీయ బ్రాండ్
విశాఖను కేవలం రాష్ట్రానికి మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. భాగస్వాములందరి సహకారంతో ఈ లక్ష్యాన్ని త్వరలోనే సాకారం చేస్తామని నమ్మకం వ్యక్తం చేశారు.
Also Read: ఈఎస్‌ఐ పీఠంపై కన్ను.. ఎంపీ, మంత్రి కార్యాలయాల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు