Pawan Kalyan: తమిళ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అగ్రనటుడు విజయ్ పయనంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. నటులుగా ఉండి రాజకీయాల్లోకి రావడం అనే అంశంపై వీరిద్దరి మధ్య సారూప్యతలు ఉన్న నేపథ్యంలో, విజయ్ ఒంటరిగా పోటీ చేయాలా లేక కూటమితో వెళ్లాలా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు పవన్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. రాజకీయాల్లో ఎవరికైనా పోటీ చేసే హక్కు ఉంటుందని, వారు తీసుకునే నిర్ణయాలను గౌరవించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
“నేను సాధారణంగా నా సొంత పిల్లలకే సలహాలు ఇవ్వను. ఎవరైనా ఒక వయస్సు వచ్చిన తర్వాత, వారిని అడిగితే తప్ప నేను సలహాలు ఇవ్వడానికి ఇష్టపడను.” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విజయ్ వంటి సమర్థవంతమైన వ్యక్తికి.. భారీ ప్రజాదరణ ఉన్న స్టార్‌కి సలహాలు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. విజయ్ రాజకీయాల్లోకి రావడం చాలా గొప్ప విషయమని, ప్రజలకు సేవ చేయాలనుకునే ఎవరినైనా తాను స్వాగతిస్తానని స్పష్టం చేశారు. స్వతంత్రంగా ఉండాలా లేక పొత్తు పెట్టుకోవాలా అనేది విజయ్ తన సొంత ఆలోచనలు.. లక్ష్యాల మేరకు నిర్ణయించుకోవాల్సిన అంశమని తెలిపారు.
నటన నుండి రాజకీయాలకు రావడం అనేది ఒక పెద్ద మలుపు అని, విజయ్ ఇప్పటికే తనదైన ముద్ర వేశారని పవన్ ప్రశంసించారు. “ప్రతి ఒక్కరికి రాజకీయ పార్టీ పెట్టుకునే హక్కు, రాజకీయాల్లో రాణించే హక్కు ఉంటుంది. ఒక వ్యక్తి ఏ పాత్రలో ఉన్నా.. స్వతంత్రంగా ఉన్నా లేదా కూటమితో ఉన్నా.. వారు ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తున్నారన్నదే ముఖ్యం.” అని పవన్ కళ్యాణ్ వివరించారు. విజయ్ తన రాజకీయ ప్రయాణంలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా, అది ప్రజల ప్రయోజనాల కోసం ఉండాలని ఆకాంక్షించారు.
తమిళనాడు రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని, అక్కడ విజయ్ తన వ్యూహాలను ఎలా అమలు చేస్తారనేది ఆయన సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని పవన్ అభిప్రాయపడ్డారు. విజయ్ రాజకీయ రాకపై పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు తమిళనాడు, ఇటు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
Read Also: మాజీ సీఎం కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు.. 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్