RK Roja: మున్సిపల్ ఎన్నికల వేళ అధికార కూటమి ప్రభుత్వం అరాచకాలకు ఒడిగడుతోందని, ఓటమి భయంతోనే రౌడీయిజం, గుండాయిజంతో ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకురాలు ఆర్కే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల అక్రమాలపై ఎన్నికల కమిషన్, న్యాయస్థానాలు తక్షణమే జోక్యం చేసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
నగరిలో నామినేషన్ల పర్వంలో తీవ్ర అక్రమాలు
నగరి మున్సిపాలిటీ పరిధిలో ముగ్గురు చైర్మన్ అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించినప్పటికీ.. అధికార బలంతో ఏకగ్రీవాలుగా ప్రకటించడం దారుణమని రోజా పేర్కొన్నారు. కేజే కుమార్ కోడలు పోటీ చేస్తున్న వార్డులో ప్రత్యర్థి అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, అడ్డుకునే క్రమంలో ఒక అభ్యర్థి బంధువుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆరోపించారు. చివరికి పోలీసుల సమక్షంలోనే నామినేషన్ పత్రాలను చించివేశారని మండిపడ్డారు. స్క్రూట్నీ సమయంలో నామినేషన్ల ఆమోదం, తిరస్కరణల వివరాలను అధికారులు స్పష్టంగా వెల్లడించలేదని, ఫామ్-7 స్లిప్ ఇచ్చిన తర్వాత కూడా టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవమైనట్లు బోర్డులు పెట్టడం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు.
న్యాయస్థానంలో హౌస్ మోషన్ దాఖలు
నగరిలో జరిగిన ఈ ఎన్నికల అక్రమాలపై వైఎస్సార్సీపీ తరఫున హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్లు రోజా వెల్లడించారు. కోర్టులో తమకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని, నగరి మున్సిపాలిటీలో మళ్లీ పారదర్శకంగా ఎన్నికలు జరగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థి గెలుస్తారనే భయంతోనే కూటమి నేతలు అక్రమ ఏకగ్రీవాలకు పాల్పడుతున్నారని, పోటీ చేసేందుకు కౌన్సిలర్ అభ్యర్థులు లేక భయపడుతూ అభ్యర్థులను బెదిరించి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేస్తున్నారని విమర్శించారు.
ఈవీఎంల నుంచి నామినేషన్ల దాకా అంతా అక్రమమే!
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు చేసినట్లే, ఇప్పుడు మున్సిపల్ నామినేషన్ల పరిశీలనలోనూ అక్రమాలకు తెగబడుతున్నారని రోజా అన్నారు. గత రెండేళ్ల కూటమి పాలనలో ప్రజలకు ఏమీ చేయలేదనే భయంతోనే దాడులకు దిగుతున్నారని, చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌లకు దమ్ముంటే ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని సవాల్ విసిరారు. వైఎస్సార్సీపీ ఎంపీలు అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తిపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తప్పు చేసిన అధికారులకు శిక్ష తప్పదు
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి, అధికార పార్టీకి కొమ్ముకాస్తూ తప్పులు చేస్తున్న అధికారుల వివరాలన్నింటినీ సేకరిస్తున్నామని రోజా హెచ్చరించారు. భవిష్యత్తులో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అక్రమాలకు పాల్పడిన అధికారులు, కూటమి నాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. చంగారెడ్డికి, తనకు జరిగినట్లే భానుకు కూడా వెన్నుపోటు తప్పదని వ్యాఖ్యానించారు. కూటమి అరాచకాలకు ప్రజలతో పాటు భగవంతుడు కూడా తగిన బుద్ధి చెబుతాడని, ‘కర్మ ఈజ్ రిటర్న్’ అని, చేసిన తప్పులకు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆమె హెచ్చరించారు.
Also Read: మలక్‌పేటలో జింక మాంసం కలకలం.. రైఫిల్, బుల్లెట్లతో ముగ్గురు అరెస్ట్!