Electric vs Petrol Bike: పెట్రోల్ ధరలు, మెయింటెనెన్స్ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది ఎలక్ట్రిక్ టూ-వీలర్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, పెట్రోల్ బైక్ కొనాలా? ఎలక్ట్రిక్ బైక్ కొనాలా? అనే సందేహం చాలామందిలో ఉంది. ఈ రెండు వాహనాలను ఐదేళ్ల వినియోగం ఆధారంగా పోల్చుకుంటే ఏది మన బడ్జెట్‌కు అనుకూలమో అంచనా వేయవచ్చు.
ఒక వ్యక్తి రోజుకు సగటున 35 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడని అనుకుందాం. ఏడాదికి 300 రోజులు వాహనాన్ని ఉపయోగిస్తే, ఐదేళ్లలో మొత్తం 52,500 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. ఈ ప్రయాణానికి అయ్యే ఖర్చులను అంచనా వేసుకుందాం.
ఒక పెట్రోల్ బైక్ లీటరుకు 50 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని, పెట్రోల్ ధర లీటరుకు రూ.117.73గా తీసుకుందాం. ఈ లెక్కన 52,500 కిలోమీటర్ల ప్రయాణానికి సుమారు 1,050 లీటర్ల పెట్రోల్ అవసరమవుతుంది. ఇందుకు దాదాపు రూ.1.24 లక్షలు ఖర్చవుతుంది. దీనికి అదనంగా ఇంజిన్ ఆయిల్, సర్వీసింగ్, ఇతర విడిభాగాల రిపేర్ల కోసం ఐదేళ్లలో సుమారు రూ.25,000 ఖర్చవుతుందని అంచనా వేస్తే, మొత్తం మెయింటెనెన్స్, ఇంధన ఖర్చు రూ.1.49 లక్షలకు చేరుతుంది. ఇది కొనుగోలు ధరకు రెట్టింపు.
ఇప్పుడు అదే ప్రయాణాన్ని ఎలక్ట్రిక్ టూ వీలర్ తో చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇంట్లో ఛార్జింగ్ చేసేటప్పుడు కిలోమీటరుకు సగటున రూ.0.35 విద్యుత్ ఖర్చవుతుందని అనుకుంటే, ఐదేళ్లకు ఛార్జింగ్ ఖర్చు సుమారు రూ.18,375 అవుతుంది. ఎలక్ట్రిక్ వాహనంలో ఇంజిన్ ఆయిల్ మార్పు లాంటి కొన్ని మెయింటెనెన్స్ పనులు ఉండవు. అయితే టైర్లు, బ్రేకులు, ఇతర విడిభాగాల ఖర్చులు ఉంటాయి. వీటికి ఐదేళ్లలో సుమారు రూ.12,000 ఖర్చవుతుందనుకుంటే, ఛార్జింగ్, మెయింటెనెన్స్ ఖర్చులు కలిపి దాదాపు రూ.30,375 అవుతాయి.
ఎలక్ట్రిక్ వాహనం ద్వారా నడిపే ఖర్చులో సుమారు రూ.1.19 లక్షలు ఆదా అయ్యే అవకాశం ఉంది. అయితే, ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు ధర ఎక్కువగా ఉంటే ఆ వ్యత్యాసాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి. బ్యాటరీ వారంటీ, వారంటీ ముగిసిన తర్వాత రీప్లేస్‌మెంట్ ఖర్చు, ఇంట్లో ఛార్జింగ్ సదుపాయం కూడా ముఖ్యం. రోజూ ఎక్కువ దూరం ప్రయాణించేవారికి, ఇంట్లో ఛార్జింగ్ సదుపాయం ఉన్నవారికి ఎలక్ట్రిక్ టూ-వీలర్ బాగుంటంది. తక్కువ దూరాలు ప్రయాణించేవారు లేదంటే తరచూ దూర ప్రయాణాలు చేసేవారు తమ అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి.
Read Also: పెట్రోల్ కారా? హైబ్రిడ్ కారా? ఏది కొంటే డబ్బు మరింత సేవ్ చేసుకోవచ్చు?