Sajjala Ramakrishna: వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని, పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాన్ని అణచివేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ప్రక్రియ అపహాస్యం
న్యాయస్థానాలకు సెలవులు ఉన్న సమయాన్ని చూసుకుని హడావుడిగా స్థానిక ఎన్నికలు తెచ్చారని సజ్జల మండిపడ్డారు. నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం, వేసిన వాటిని బలవంతంగా తిరస్కరించడం జరుగుతోందని చెప్పారు. ప్రజాబలం లేకనే పోలీసుల బలంతో ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని, ఇవి ప్రజాస్వామ్య విజయాలు కానేకావని స్పష్టం చేశారు.
పోలీసుల దాడులు, అక్రమ కేసులు
పులివెందులలో నామినేషన్లకు వచ్చిన వారిపై ఏకంగా పిస్టళ్లు, ఏకే-47లతో కాల్పులు జరపడం దారుణమని సజ్జల ఆక్షేపించారు. వందలాది మంది వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. రాయచోటి, దర్శి ప్రాంతాల్లోనూ తీవ్రమైన సెక్షన్లతో కేసులు బనాయించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కక్షసాధింపు రాజకీయాలు
మంగళగిరిలో దళిత నాయకుడు దాసరి వీరయ్యపై పీడీ యాక్ట్ ప్రయోగించడం రాజకీయ కక్షసాధింపునకు పరాకాష్ట అని ధ్వజమెత్తారు. దుగ్గిరాలలో పార్టీ గెలుస్తుందనే భయంతోనే ఆయనను ఎన్నికలకు దూరం చేశారని తెలిపారు. కడప, చిత్తూరు జిల్లాల్లోనూ అభ్యర్థులను ప్రచారం చేసుకోనీయకుండా దాడుల నుంచి కాపాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు.
హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
పులివెందుల పోలీసు కాల్పులు, ఎన్నికల హింసపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా రాష్ట్రానికి సంబంధం లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుబంధ సంస్థలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, దాడులు చేసినా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైఎస్సార్‌సీపీ వెనకడుగు వేయదని, న్యాయస్థానాల్లోనూ, ప్రజాక్షేత్రంలోనూ పోరాటం కొనసాగిస్తామని సజ్జల తేల్చిచెప్పారు.
Also Read: కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి సందడి.. డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం