Amaravati: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. అధికార – విపక్షాలకు చెందిన పలువురు అభ్యర్థులు తొలిరోజు తమ తమ నామినేషన్లు దాఖలు చేశారు. కూటమి పార్టీల మధ్య జెడ్పీ పీఠాలు కేటాయింపు ఇంకా లెక్కలు తేలకపోవడంతో మూడు పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇంతకీ కూటమి పార్టీల మధ్య చర్చలు ఏ మాత్రం వరకు వచ్చాయి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతోంది.
ఏపీ వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థుల నామినేషన్ల సందడి నెలకొంది. మొత్తం జెడ్పీటీసీ-659, ఎంపీటీసీ- 9829 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తొలిరోజు జెడ్పీటీసీలు-409 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అందులో టీడీపీ-128, వైసీపీ-192, జనసేన-21, బీజేపీ-24, సీపీఐ-6, కాంగ్రెస్-17 నుంచి వచ్చాయి. ఇక ఎంపీటీసీలకు సంబంధించి 5267 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో టీడీపీ-2719, వైసీపీ1918, జనసేన -294, బీజేపీ-74, సీపీఐ-44, కాంగ్రెస్ -19, బీఎస్పీ-17, ఇరత పార్టీల నుంచి భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి.
వైసీపీ అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది. ఇక కూటమి మధ్య పీఠాల గురించి ఇంకా చుక్కుముడి వీడడం లేదు. ఎవరికి ఎన్ని అనేదానిపై తర్జన భర్జన కంటిన్యూ అవుతోంది. బుధవారం నుంచి దీనిపై మూడు పార్టీల నేతలు చర్చలు జరుపుతున్నారు. తొలుత 28 జెడ్పీ పీఠాలపై దృష్టి పెట్టారు. గురువారం సాయంత్రం నాటికి కొలిక్కి రావచ్చని ఆయా పార్టీల అంతర్గత సమాచారం. జనసేన 6 నుంచి 10 మధ్య కోరుతోందని, బీజేపీ 2 నుంచి 5 డిమాండ్ చేస్తోందని సమాచారం. అయితే టీడీపీ అందుకు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది.
ALSO READ: హింసాత్మకంగా దేవరగట్టు కర్రల సమరం.. ఒకరు మృతి, 100కి పైగా గాయాలు
3 లేదా 5 జనసేనకు ఇవ్వాలని ఆలోచన చేస్తోందట టీడీపీ. బీజేపీకి ఒక్కటి ఇవ్వాలని భావిస్తోందట. దీనిపై గురువారం మూడు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. దిగువ స్థాయిలో ఎవరు ఎన్నేసి స్థానాలకు పోటీ చేయాలనే దానిపై కూడా లెక్కలు వేస్తున్నారు. జిల్లా స్థాయి కమిటీ ఇప్పటికే ఆ పనిలో నిమగ్నమైంది. తమ తమ పార్టీల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాయి. మరికొందరైతే నామినేషన్లు వేశారు. శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగియడంతో గురువారం రాత్రికి సీట్ల పంపకాలు ఓ కొలిక్కి రావచ్చని అంటున్నారు.