Boat Accident: గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తాడేపల్లి మండలం ప్రాతూరు గ్రామానికి చెందిన ఐదుగురు స్నేహితులు సరదాగా కృష్ణానది పాయను దాటి అవతలికి వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో వారు ఎక్కిన నాటు పడవలోకి ఒక్కసారిగా నీరు చేరి మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బాలురు నీట మునిగి ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు.
నదిలో నుంచి ఈదుకుంటూ ఒడ్డుకు..
ప్రాతూరుకు చెందిన ఈశ్వర్, సందీప్, సంతోష్, అర్జున్, హర్షలు నాటు పడవలో నదీపాయ దాటి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వేరొక నాటు పడవ ఎక్కగా, అందులోకి నీళ్లు చేరి ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని గమనించిన సందీప్, సంతోష్, ఈశ్వర్‌లు వెంటనే ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు దక్కించుకున్నారు. అయితే అర్జున్ (17), హర్ష (18) నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు.
గ్రామంలో తీరని శోకం
బయటపడిన ముగ్గురు స్నేహితులు గ్రామానికి వెళ్లి విషయం చెప్పడంతో గ్రామస్థులు, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. గజఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది నదిలో గాలించి అర్జున్, హర్ష మృతదేహాలను బయటకు తీశారు. అర్జున్ పదో తరగతి వరకు చదివి ఇంట్లోనే ఉంటుండగా.. తాడికొండలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న హర్ష, దసరా సెలవులకు ఊరికి వచ్చి ఇలా అనంత లోకాలకు వెళ్లాడు. రెండేళ్ల కిందట తల్లిని, మూడేళ్ల కిందట తండ్రిని కోల్పోయిన హర్ష కూడా ఇప్పుడు దక్కకపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Also Read: బీ కేర్ ఫుల్!.. ఎవరెవరు ఏం చేస్తున్నారో అంతా తెలుసు.. సైబరాబాద్ కమిషనర్ స్ట్రాంగ్ వార్నింగ్!