Amaravati: ఏపీలోని స్థానిక సంస్థ ఎన్నికల్లో కూటమి జోరు కొనసాగుతోంది. 17 మున్సిపాలిటీలను కూటమి పార్టీలు ఏకగ్రీవంగా గెలుచుకున్నాయి. ఫలితాల్లో అదే జోరు కనబరచాలని ఆలోచన చేస్తున్నాయి. వీటిపై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇవేమీ నిజమైన పరీక్షలు కావని తేల్చేశారు.
ట్రెండ్‌ని తనకు అనుకూలంగా మార్చుకోవడంతో విజయసాయిరెడ్డికి తిరుగులేదు. ఈ విషయాన్ని కొందరు నేతలు అప్పుడప్పుడు చెబుతారు. ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతీ మాట ఇప్పుడు స్పష్టత వస్తుందని, గతంలో క్లారిటీ ఉండేది కాదని అనేవారు. రేపో మాపో కొత్త పార్టీ పెట్టేందుకు సిద్దమైన ఆయన, ఏపీ వ్యాప్తంగా మీడియా సమావేశాలతో ఊదరగొట్టారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మీడియా సమావేశాలు పెట్టి అక్కడి ప్రజల ఆలోచనకు అనుగుణంగా మాట్లాడారు.
తాజాగా ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలపై నోరు విప్పారు. రాత్రి ఎస్ఈసీ ప్రకటన తర్వాత దాదాపు 17 మున్సిపాలిటీలను కూటమి పార్టీలు ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నాయి. అన్నింటి కంటే ముందుగా వైసీపీకి కంచుకోటగా భావించే ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లోని వైసీపీ కంచుకోటలు బద్దలయ్యాయి. ఆయా ప్రాంతాల్లో చాలా మున్సిపాలిటీలు ఏకగ్రీవంగా టీడీపీ ఖాతాలో పడ్డాయి. ఎక్కువమంది టీడీపీకి చెందినవారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పెద్ద విషయమేమీ కాదన్నారు.
అధికార టీడీపీ.. తన బల ప్రయోగం, ధన బలం, ఒత్తిడి వ్యూహాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించవచ్చని అన్నారు. ఇవేమీ ప్రజల మద్దతుకు నిజమైన పరీక్షలు కావని తేల్చేశారు. 2029 ఎన్నికలు అసలైన పరీక్షలుగా వర్ణించారు. ఈ లెక్కన విజయసాయిరెడ్డి మనసులోని మాటను స్పష్టంగా బయట పెట్టలేదు. ఏదో ఎక్స్ వేదికగా కామెంట్స్ చేయాలని చేసినట్టు కనిపిస్తోందని అంటున్నారు.
ALSO READ: ‘వాళ్ళు గడ్డి తిన్నారని.. మీరూ అదే తింటారా’? కూటమి ప్రభుత్వంపై షర్మిల ఫైర్!
అంటే వచ్చే ఎన్నికల్లో ఏదో జరగబోతోందన్న సంకేతాలు ఇచ్చినట్టు ప్రత్యర్థి పార్టీలు చెబుతున్నాయి. విశ్లేషణలు ఓకే.. పార్టీ ఎప్పుడంటూ సాయిరెడ్డిని హార్డ్ కోర్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ముందు చెప్పినట్టుగా నవంబర్ ఫస్ట్ వీక్ పార్టీ పెడతారా? లేకుంటే గ్రహాలు అనుకూలించలేదని మరొక తేదీ ప్రకటిస్తారా? అనేది చూడాలి.