YS Sharmila: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఏకగ్రీవాల అంశం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. స్థానిక పోరులో అధికార కూటమి పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె కూటమి ప్రభుత్వంపై, రాష్ట్ర ఎన్నికల సంఘం పనితీరుపై నిప్పులు చెరిగారు.
బలవంతపు ఏకగ్రీవాలు.. ప్రజాస్వామ్యానికి చేటు!
స్థానిక సంస్థల్లో ప్రస్తుతం జరుగుతున్నవి నిజమైన ఏకగ్రీవాలు కావని, అవి అధికార మదంతో కూటమి పార్టీలు చేసిన బలాత్కారాలని షర్మిల ఘాటుగా విమర్శించారు. ఇవి ప్రజల ఆమోదానికి సంకేతం కాదని, కూటమి అరాచకాలకు సజీవ సాక్ష్యాలని పేర్కొన్నారు. ప్రతిపక్ష అభ్యర్థులను భయాందోళనలకు గురిచేస్తూ.. నామినేషన్ పత్రాలను నడిరోడ్డుపై చింపేస్తూ, రక్తపాతంతో ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని ఆమె మండిపడ్డారు. పోలీసు వ్యవస్థను తమ బానిసగా మార్చుకుని ఎన్నికల వ్యవస్థను పూర్తిగా అవహేళన చేశారని ధ్వజమెత్తారు.
వైఎస్సార్సీపీ బాటలోనే కూటమి!
రాష్ట్రంలోని 16 మున్సిపాలిటీలు, 639 వార్డులు, 4 జెడ్పీటీసీలు, 32 ఎంపీటీసీ స్థానాల్లో సాధించినవి ఏకగ్రీవాలు కావని, కూటమి సృష్టించిన భయోత్పాతానికి నిదర్శనమని షర్మిల స్పష్టం చేశారు. ‘ఆనాడు వైఎస్సార్సీపీ తప్పులు చేసిందని, నేడు మీరూ అదే చేస్తారా? వాళ్ళు చేసిన తప్పులనే మీరూ పునరావృతం చేస్తారా?’ అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలకు నిజంగా నమ్మకం ఉంటే, ఈ రకమైన బలవంతపు ఏకగ్రీవాలకు ఒడిగట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీ డిమాండ్
ఈ అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పందించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ కూటమికి కొమ్ముకాయకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. బలవంతంగా ఏకగ్రీవం చేసిన స్థానాల ఫలితాలను వెంటనే నిలిపివేసి, వాటిపై సమగ్ర విచారణ జరిపి ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Also Read: ‘తెలంగాణ ఎండిపోతుంటే నీకేం పని అక్కడ’? సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ రాంచందర్ రావు!