Sirimanotsavam 2026: విజయనగరం అంటేనే పైడితల్లి అమ్మవారి జాతర.. జాతర అంటేనే సిరిమానోత్సవం..! తరతరాలుగా వస్తున్న సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకను తిలకించేందుకు ఉత్తరాంధ్ర నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. సిరిమానోత్సవంలో ప్రధాన ఆకర్షణ.. భారీ సిరిమాను. సంప్రదాయ పద్ధతిలో అలంకరించిన ఈ సిరిమానుపై పూజారి అధిష్ఠించి ఊరేగింపులో పాల్గొనడం ఉత్సవంలో ప్రత్యేకత. అమ్మవారి కృప తమపై ఉండాలని భక్తులు సిరిమానుకు మొక్కులు చెల్లించుకుంటారు. భక్తి, సంప్రదాయం, జానపద సంస్కృతుల కలయికగా ఈ వేడుక కొనసాగుతోంది.
ఈ నెల 26న తోలేళ్ల ఉత్సవం.. 27న సిరిమానోత్సవం జరగనున్న నేపథ్యంలో విజయనగరంలో ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్పీ దామోదర్‌తో కలిసి ఉత్సవ మార్గాలను పరిశీలించిన కలెక్టర్.. కోట నుంచి మూడో లాంతర్లు, అమ్మవారి ఆలయం, శివాలయం వీధి కూడలి, అంబటి సత్రం జంక్షన్‌తో పాటు దర్గా నుంచి శ్రీకాకుళం రోడ్డు వైపు బారికేడ్ల ఏర్పాట్లను సమీక్షించారు.
భక్తుల రద్దీని నియంత్రించేందుకు క్యూలైన్లు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పోలీసు బందోబస్తుపై ప్రత్యేక దృష్టి సారించారు. నిరంతర పర్యవేక్షణ కోసం కంట్రోల్ రూమ్‌లు, కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు ప్రమాదకర భవనాలపైకి ఎక్కకుండా చర్యలు తీసుకోవాలని, సిరిమాను మార్గంలో తొక్కిసలాటకు అవకాశం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. మరోవైపు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also read: తెలంగాణకు భారీ పెట్టుబడుల వరద.. సీఎం రేవంత్ వ్యూహం ఇదే?