ఏపీలో బెదిరింపు రాజకీయాలు కొనసాగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉన్నవారిని బెదిరింపులకు, భయాందోళనలకు గురిచేస్తుంటుంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ, ఇక్కడ మాత్రం అంతా రీవర్స్‌గా కొనసాగుతున్నట్టు సమాచారం.ప్రతిపక్ష వైసీపీ నేతలు, మాజీ మంత్రులు ఏకంగా కూటమి ప్రభుత్వం నేతలను బెదిరిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.త్వరలోనే వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని.. జగన్ ముఖ్యమంత్రి అవుతారని అప్పుడు అందరి లెక్కలు తేలుస్తామని వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, వైసీపీ నేతలు తామింకా అధికారంలోనే ఉన్నామని భ్రమలకు పోతున్నారని.. అందుకే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా పోస్టు పెట్టారని, దూషించారని మహిళలు అని కూడా దూషించి దాడులకు పాల్పడిన చరిత్ర ఆ పార్టీకి ఉందని కూటమి నేతలు విమర్శిస్తున్నారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని ఓ వైద్యుడిని పిచ్చోడిగా ముద్ర వేసి హింసించిన విషయం గుర్తుందా? అని ప్రశ్నిస్తున్నారు. హాస్పిటల్స్‌లో మెడిసిన్స్ లేవని, కరోనా సమయంలో ప్రాణాలు పోతున్నాయని అన్నందుకు ఏకంగా వైద్యుడిని చిత్రహింసలు పెట్టిన రోజులను ప్రస్తుతం కూటమి నేతలు గుర్తుచేస్తున్నారు. అంతేకాకుండా, టీడీపీ నేతలపై ఇష్టానుసారంగా దాడులకు పాల్పడటంతో పాటు వారిపైనే రివర్స్‌లో కేసులు పెట్టించిన విషయాన్ని తామింకా మర్చిపోలేదని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.
ప్రస్తుతం జగన్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. విచిత్రం ఏంటంటే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఆ పార్టీకి కేవలం 11 సీట్లను మాత్రమే ప్రజలు పోయిన ఎన్నికల్లో కట్టబెట్టారు. దీనర్థం ఏంటంటే జగన్‌ను ముఖ్యమంత్రిగా ప్రజలు చూడలేకపోవడమే అని.. ఐదేండ్లలో అరాచకం చేయడం వల్లే ఆయన్ను గద్దె దించారని.. అలాంటప్పుడు మరోసారి ఆయనకు అధికారం ఎలా ఇస్తారని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. వచ్చే టర్ములో తమకు అధికారం వస్తుందని వైసీపీ నేతలు కలలు కంటున్నారని.. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్నినాని, గుడివాడ అమర్ నాథ్, రోజా, విడుదల రజినీ వంటి నేతలు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారని తెలుగు తమ్ముళ్లు సెటైర్లు వేస్తున్నారు.
అధికారం దూరమైతే ఎవరైనా గతంలో తాము ఎందుకు ఓడిపోయామని సమీక్షించుకోవాలని, మరల ఈ పొరపాటు జరగకుండా, ప్రజల అభీష్టం మేరకు పనిచేయడంపై దృష్టి సారించాలని పలువురు సూచిస్తున్నారు. అంతేకానీ ప్రభుత్వానికి, ప్రజలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, బెదిరింపులకు గురిచేయడం సరికాదని కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు. దాడులకు ప్రతిదాడులు ఉంటాయని, అన్ని నోట్ చేసుకుంటున్నామని.. రెడ్ బుక్ బదులు తాము కొత్త బుక్ తెరుస్తామని, దెబ్బకు దెబ్బ తీస్తామని మాజీ మంత్రి అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలపైనా సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొన్నటివరకు జైలులో ఉండి వచ్చిన ఆయనకు పంచ్ డైలాగులు అవసరమా? అని మండిపడుతున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తో పాటు వారి ఫ్యామిలీ మెంబర్లను టార్గెట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రిటర్న్ బహుమతి ఇస్తామని వైసీపీ నేతలు చెప్పడం ఇకనైనా మానుకోవాలని లేదంటే చాలా మంది జైలుకు వెళ్లే అవకాశం లేకపోలేదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.