Amaravati: ఏపీలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన చర్యల కారణంగా 72 శాతం నుంచి 82 శాతానికి అక్షరాస్యత రేటు చేరింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి వంద శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా నిలపాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు మంత్రి నారా లోకేష్.
మంగళవారం పాఠశాల-ఇంటర్మీడియట్ విద్యా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. విద్యా వ్యవస్థలో చేపడుతున్న సంస్కరణలు, కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి 100 శాతం అక్షరాస్యత సాధించే దిశగా అడుగులు వేయాలని అధికారులను ఆదేశించారు. మార్చి 2027 నాటికి మార్చి నాటికి 25 లక్షల మంది, సెప్టెంబర్ నాటికి మిగిలిన 27 లక్షల మందిని అక్షరాస్యులుగా చేయడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ 2024 నాటికి ఏపీ అక్షరాస్యత రేటు కేవలం 72.6 శాతం ఉండేదన్నారు. వివిధ రాష్ట్రాలతో పోల్చితే దేశంలో అట్టడుగున ఏపీ ఉందన్నారు.
2024లో 72.6 శాతం నుండి 82.1 శాతానికి పెరిగిందని గుర్తు చేశారు. ఏడాదిగా కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో 25 లక్షల మంది నిరక్షరాస్యులు అక్షరాస్యులుగా మారారన్నారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్ర ప్రభుత్వం అభినందించిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు దృష్టికి తీసుకొచ్చారు. 11 ప్రభుత్వ శాఖల సమన్వయంతో వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, ఎమ్మెల్యేలను-స్థానిక ప్రతినిధులను అందులో భాగస్వాములను చేయాలని సూచించారు. కేంద్రం విడుదల చేసిన వయోజన విద్య పరీక్షా ఫలితాల్లో ఏపీ అక్షరాస్యత శాతం 10 శాతం పెరిగి 82.1 శాతానికి చేరుకుందన్నారు మంత్రి లోకేష్. ఇదే స్ఫూర్తితో 2027 సెప్టెంబర్ నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలన్నారు.
ఈ సమీక్షలో పాఠశాలకు వెళ్లని పిల్లలపై దృష్టి సారించారు. ప్రస్తుతం 1,64,821 మంది పాఠశాల వయస్సు గల పిల్లలు విద్యా వ్యవస్థకు వెలుపల ఉన్నారని వెల్లడించారు అధికారులు. ఆ పిల్లలను గురించి వారినీ పాఠశాలల చేర్పించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ ఏడాదిలో సుమారు 33 వేల మంది పిల్లలు పాఠశాలల్లో చేర్చామని తెలిపారు. మిగతా పిల్లల వివరాలను LEAP యాప్ ద్వారా ప్రధాన ఉపాధ్యాయులతో పంచుకున్నారు. ఏపీలో ఉపాధ్యాయుల హాజరు 98.97 శాతంగా ఉండడంపై సంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి లోకేష్. అదే సమయంలో విద్యార్థుల హాజరు 85.41 శాతం ఉండగా దాన్ని పెంచాలని సూచించారు. వరుసగా మూడు రోజులు పాఠశాలకు రాని విద్యార్థుల తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. ఆ బాధ్యతను పాఠశాల యాజమాన్య కమిటీలకు అప్పగించాలని ఆదేశాలు ఇచ్చారు.
ALSO READ: వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన
గతేడాదితో పోలిస్తే ఇంటర్మీడియట్ అడ్మిషన్లు సుమారు 10 వేలు పెరిగాయని అధికారులు వివరించారు. వెనుకబడిన విద్యార్థుల కోసం సంకల్ప్ అకడమిక్ సపోర్ట్ ప్రోగ్రామ్ కింద అదనపు తరగతులు నిర్వహించేందుకు రూటు మ్యాప్ రెడీ చేసినట్టు తెలిపారు. ఈ ఏడాది తల్లికి వందనం పథకం కింద ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వం రూ.1,051 కోట్ల ఆర్థిక సహాయం చేసినట్టు వివరించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు 100 శాతం అపార్ ఐడీ అనుసంధానాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి లోకేష్.