69 Children from One Mother: ఒక మహిళ గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం అనేది శారీరకంగా ఎంతో కష్టమైన పని. అయినప్పటికీ మాతృత్వంపై ఉన్న ప్రేమతో చాలామంది మహిళలు ఆ బాధను భరిస్తారు. సాధారణంగా ఒక మహిళకు ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉండటం చూస్తుంటాం. కొందరికి ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కూడా ఉంటారు. కానీ, ఏకంగా 69 మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళ గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ అరుదైన రికార్డు రష్యాకు చెందిన వాలెంటినా వాసిలీవ్ అనే మహిళ సాధించింది.
రష్యాకు చెందిన రైతు ఫియోడర్ వాసిలీవ్ భార్య వాలెంటినా వాసిలీవ్ 1725 నుంచి 1765 మధ్య కాలంలో ఏకంగా 27 సార్లు గర్భం దాల్చిందని చెబుతారు. ఈ ప్రసవాల ద్వారా ఆమె మొత్తం 69 మంది పిల్లలకు జన్మనిచ్చినట్లు నివేదికల్లో ఉంది. ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆమెకు ప్రతి గర్భంలో ఒక్కో బిడ్డ పుట్టలేదు. 16 సార్లు కవలలు జన్మించగా, ఏడు సార్లు ముగ్గురు చొప్పున పిల్లలు పుట్టినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. మరో నాలుగు ప్రసవాల్లో నలుగురు పిల్లలు చొప్పున జన్మించారట. ఈ వివరాల ఆధారంగానే వాలెంటినా పేరు అత్యధిక మంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లిగా గిన్నిస్ రికార్డుల్లో గుర్తింపు పొందింది.
వాలెంటినా భర్త ఫియోడర్ వాసిలీవ్‌కు మరో వివాహం కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఆ మహిళ కూడా ఎనిమిది సార్లు గర్భం దాల్చి 18 మంది పిల్లలకు జన్మనిచ్చిందట. దీంతో ఫియోడర్ కు మొత్తం 87 మంది పిల్లలు ఉన్నట్లు రికార్డుల్లో నమోదైంది. అయితే అప్పటి కాలంలో వైద్య సదుపాయాలు అంతగా అందుబాటులో లేకపోవడంతో కొంతమంది పిల్లలు చిన్న వయసులోనే మరణించినట్లు సమాచారం.
69 మంది పిల్లలకు జన్మనివ్వడం సాధ్యమేనా? అనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంది. దీనిపై వైద్య నిపుణులు కూడా ఆసక్తి వ్యక్తం చేశారు. ఒక మహిళకు ఇన్ని గర్భాలు రావాలంటే దాదాపు నాలుగు దశాబ్దాల పాటు గర్భధారణ, ప్రసవాలు కొనసాగాల్సి ఉంటుందని నిపుణుల అభిప్రాయం. సాధారణంగా మహిళల్లో రుతుక్రమం యుక్తవయసులో ప్రారంభమవుతుంది. వయసు పెరిగే కొద్దీ సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. ముఖ్యంగా 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చే అవకాశం తగ్గుతుంది.
వాలెంటినా కథ చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన ఘటనగా నిలిచిపోయింది. అయితే వరుసగా 27 గర్భాలు దాల్చడం, 69 మంది పిల్లలకు జన్మనివ్వడం వంటి విషయాలను ఆధునిక వైద్య ప్రమాణాలతో నిర్ధారించడం కష్టం. అప్పటి రికార్డులు, చారిత్రక కథనాలపైనే ఈ సమాచారం ఎక్కువగా ఆధారపడి ఉంది. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యధిక మంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లిగా ప్రసిద్ధి చెందిన కథ అయినప్పటికీ.. ఇది ఎంతవరకు పూర్తిగా వాస్తవమనే విషయంలో ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది.
Read Also: క్లియోపాత్రా అందానికి ప్రపంచమే ఫిదా.. ఇంతకీ ఆమె సౌందర్య రహస్యం ఏంటో తెలుసా?