Jagan- Sharmila: ఏపీ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సీఎం చంద్రబాబు నాయుడు మధ్య మాటల యుద్ధం ముదిరింది. స్థానిక సంస్థల ఎన్నికల హింస నుంచి దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది. ముఖ్యంగా జగన్‌ను ‘కంసమామ’తో పోల్చడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ నెల 9న షర్మిలకు జగన్ రాసిన వ్యక్తిగత లేఖను పార్టీ అధికారికంగా విడుదల చేసింది.
జగన్ లేఖలోని ముఖ్యాంశాలు
జగన్ చెల్లెలు షర్మిల కుమార్తె (మేనకోడలు) అంజలి వివాహ వేదికగా మారిన బెంగళూరులోని యలహంక ఇల్లు తమ ఉమ్మడి ఆస్తి అయినప్పటికీ.. అక్కడ పెళ్లి వేడుక నిర్వహించడం వల్ల తీవ్రమైన భద్రతా సమస్యలు తలెత్తుతాయని జగన్ ఆ లేఖలో స్పష్టం చేశారు. ‘డియర్ షర్మీ’ అంటూ ప్రారంభమైన ఆ లేఖలో అంజలి వివాహం పట్ల తనకెంతో సంతోషం ఉందని, ఆమె జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే జెడ్-ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న తనకు, పెళ్లి పనుల నిమిత్తం వందలాది మంది అపరిచిత వ్యక్తులు ఇంటిలోకి వస్తే గోప్యతకు, భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రాజకీయ రంగు పులుముకుంటున్న కుటుంబ వివాదం
తన కుమార్తెల వివాహం జరిగినా తాను ఇదే నిర్ణయం తీసుకునేవాడినని, తన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని జగన్ ఆ లేఖలో కోరారు. అయితే, కుటుంబానికి సంబంధించిన ఈ వ్యక్తిగత అంశాన్ని రాజకీయాల్లోకి లాగి చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించడం సరికాదని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఒకవైపు పెళ్లి వేదికపై కుటుంబసభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. మరోవైపు ఈ అంశం ఏపీ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద దుమారమే రేపుతోంది.
Also Read: నా ప్రాణం తీద్దామని చూశారు.. కేటీఆర్‌పై ఎంపీ అరవింద్ సంచలన ఆరోపణలు!