Khammam Politics: స్వేచ్చ బ్యూరో: ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సామాజిక ప్రాతినిధ్యంపై కొత్త చర్చ మొదలయింది. దశాబ్దాలుగా కొనసాగు తున్న రాజకీయ సమీకరణా ల మధ్య మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజకీ యంగా తగిన అవకాశాలు లభిస్తున్నాయా? అనే ప్రశ్న ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంటోంది. నల్లగొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేయనున్న నామినేటెడ్ పదవుల పందేరం కీలకంగా మారింది.
ఖమ్మం రాజకీయాల్లో బీసీ, మైనార్టీలకు అవకాశం ఎప్పుడు? అనే ప్రశ్న ఇప్పుడు సామాజిక ప్రాతినిధ్యం పై జరుగుతున్న చర్చలో ప్రధాన అంశంగా నిలిచింది. ఖమ్మం జిల్లా నుంచి కాంగ్రెస్ అధిష్ఠానం నామినేట్ చేసే ఈ పదవి ఎవరికి దక్కుతుంది? సంప్రదాయ రాజకీయ సమీకరణాలకే ప్రాధాన్యం ఇస్తారా? లేక సామాజిక ప్రాతినిద్యానికి పెద్దపీట వేస్తారా? అనే ప్రశ్నలు కాంగ్రెస్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జరగనున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియలోముఖ్యంగా ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీసీ లేదా మైనార్టీ అభ్యర్థికి అవకాశం కల్పిస్తారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.
ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కి టికెట్ కేటాయించగా, బీసీ లేదా మైనార్టీ అభ్యర్థికి నామినేటెడ్ పదవి అవకాశం కల్పించాలనే ఆకాంక్షకు విస్తృత మద్దతు లభిస్తే, అది నామినేటెడ్ పోస్టు ఎంపిక కు జరిగే ప్రక్రియను ప్రభావితం చేయవచ్చు. అయితే ఖమ్మం జిల్లాలో అధికారం లో ఉన్న ముగ్గురు మంత్రుల ఆమోద ముద్ర లేనిదే ఎవరికైనా పదవి నిర్ణయించబడదనేది నిర్వివాదమైన అంశం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయమనేది పోస్టు ఆశిస్తున్న అభ్యర్థి పనితీరు, రాజకీయ పరిస్థితులు, వివిధ వర్గాల మద్దతు వంటి అంశాలపై కూడా నామినేటెడ్ పోస్టుకు అభ్యర్థి ఎంపిక ఆధారపడి ఉంటుందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్ని వర్గాల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని, ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని విస్తరించే దిశగా నిర్ణయాలు తీసుకోవాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
Also read: 40 ఏళ్ల సినీ కెరియర్ లో ఫస్ట్ టైం ఆ పని చేసిన రజినీకాంత్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!
ఖమ్మం రాజకీయ చరిత్రలో గతంలో కొన్ని సందర్భాల్లో మైనార్టీ అభ్యర్థులకు రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయించగా, ప్రజలు వారిని గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ తర్వాతి కాలంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు వరుసగా ప్రాతినిధ్యం వహిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇతర సామాజిక వర్గాలకు కూడా రాజకీయ అవకాశాలు కల్పించాలనే చర్చ ముందుకు వస్తోంది. కాంగ్రెస్ వంటి ఫక్తు ప్రజాస్వామ్య పార్టీలో ప్రతి సామాజిక వర్గానికి రాజకీయ భాగస్వామ్యం ఉండటం ముఖ్యం. తమ వర్గాల సమస్యలను ప్రభుత్వం ముందు ప్రస్తావించే అవకాశం అందరికీ ఉండాలనే అభిప్రాయం బలపడిందిక్కడ.
ప్రస్తుతం మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీవర్గాల్లో రాజకీయ ప్రాతినిధ్యంపై చర్చ పెరుగుతోంది. విద్య, ఉపాధి, సామాజిక న్యాయం, స్థానిక అభివృద్ధి, పేదరిక నిర్మూలన, యువతకు అవకాశాలు వంటి అంశాలపై తమ సమస్యలను అర్థం చేసుకునే నాయకత్వం ఉండాలని ఆయా వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖమ్మం నుండి నామినేటెడ్ పోస్టు కు సరైన అభ్యర్థి ఎంపిక సమయంలో సామాజిక సమీకరణాలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలు, అభ్యర్థి సామర్థ్యం, ప్రజాసేవలో వారి పాత్ర, స్థానికంగా ఉన్న ప్రజాదరణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బీసీ లేదా మైనార్టీ అభ్యర్థికి అవకాశం కల్పించాలనే చర్చకు ప్రజల్లో ఎంత మద్దతు లభిస్తుంది? వివిధ వర్గాల మధ్య ఐక్యత ఎంతవరకు ఏర్పడుతుంది? అధికార పార్టీ నామినేటెడ్ పోస్టుల పందేరం లో ఏ ఏ అంశాలు అభ్యర్థుల ఎంపికు పరిగణనలోకి తీసుకుంటుందీ? అనేవి కీలకమైన ప్రశ్నలు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి బీసీ లేదా మైనార్టీ వర్గాల ప్రజలు తమ అభిప్రాయాలను ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తం చేస్తూ, సముచిత ప్రాతినిధ్యం కోసం తమ డిమాండ్‌ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుంచాయి. అయితే సదరు అభ్యర్థి ఏ సామాజిక వర్గానికి చెందినవారు అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని సంపాదించగలరా? స్థానిక సమస్యలపై అవగాహన కలిగి ఉన్నారా?, ప్రజలకు అందుబాటులో ఉంటారా? అభివృద్ధికి స్పష్టమైన ప్రణాళికను ప్రతిపాదించడం వంటి ప్రాతిపదికన కూడా అంశాల వారిగా బేరీజు చేసి నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి.
ఖమ్మం నియోజకవర్గంలో అధికార పార్టీ శ్రేణులకు నామినేటెడ్ పదవి కేటాయింపు అనేది కేవలం ఒక వ్యక్తికి అవకాశం కల్పించే అంశం మాత్రమే కాదు. సామాజిక ప్రాతినిధ్యం, ప్రజల ఆకాంక్షలు, పార్టీ విధానాలు, అభ్యర్థి సామర్థ్యం వంటి అనేక అంశాలతో ముడిపడి ఉంది.అన్ని సామాజిక వర్గాలకు సముచిత అవకాశాలు కల్పించే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలనే అభిప్రాయం ప్రజాస్వామ్య చర్చలో భాగంగా ఉంది. ఇక్కడి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజల అభిప్రాయాలను వినడం, వారి సమస్యలను గుర్తించడం, రాజకీయ నిర్ణయాల్లో వారి భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం అవసరం.
సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, ప్రజాసేవకు ప్రాధాన్యం ఇచ్చే రాజకీయ సంస్కృతి బలపడినప్పుడే ప్రజాస్వామ్యానికి మరింత అర్థం చేకూరుతుంది. ఖమ్మం రాజకీయాల్లో బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరికొద్ది రోజుల్లో తేట తెల్లం కాబోతున్నది.
Also read: ఎస్ఐ ప్రియాంక వేటుపై.. సోషల్ మీడియాలో విడదల రజిని సంచలన పోస్ట్?