2026 Tata Tiago Base Variant: టాటా మోటార్స్ రీసెంట్ గా 2026 టియాగో ఫేస్ లిఫ్ట్ ను మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.4.69 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. కొత్త డిజైన్, అప్ డేటెడ్ ఇంటీరియర్, మెరుగైన భద్రతా ఫీచర్లతో ఈ హ్యాచ్ బ్యాక్ కొనుగోలుదారులను ఆకట్టుకుంటుంది. టియాగో మొత్తం ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉండగా, వాటిలో అత్యంత చౌకైనది స్మార్ట్ వేరియంట్.
బేస్ వేరియంట్ అయినప్పటికీ టియాగో స్మార్ట్ లో కొన్ని కీలక మార్పులు ఉన్నాయి. ముందు భాగంలో కొత్త గ్రిల్, పెద్ద ఎయిర్ ఇన్ టేక్ లు కారుకు స్పోర్టీ లుక్ ను ఇస్తాయి. LED హెడ్ ల్యాంప్స్, LED DRLs లాంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో లేవు. సాధారణ హాలోజన్ హెడ్ లైట్లు మాత్రమే అందించారు. సైడ్ ప్రొఫైల్ లో 13 అంగుళాల స్టీల్ వీల్స్ కనిపిస్తాయి. టాప్ వేరియంట్లలో ఉండే అల్లాయ్ వీల్స్ ఇందులో ఉండవు. అలాగే ORVM టర్న్ ఇండికేటర్లు, క్రోమ్ డోర్ హ్యాండిల్స్ లాంటి కొన్ని స్టైలింగ్ ఫీచర్లు కూడా మిస్ అవుతాయి. అయితే LED టెయిల్ ల్యాంప్స్ మాత్రం బేస్ వేరియంట్ నుంచే అందుబాటులో ఉన్నాయి.
ఇంటీరియర్ విషయానికి వస్తే, బ్లాక్ గ్రే కలర్ థీమ్ తో సాధారణ డిజైన్ ను అందించారు. ఫ్యాబ్రిక్ సీట్లు, టూ స్పోక్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ధరలో డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఇవ్వడం విశేషం. టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్, 12V పవర్ సాకెట్ లాంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.
ఫీచర్ల విషయంలోనే రాజీ పడాల్సిందే!
ఈ కారు ఫీచర్ల పరంగా కొన్ని అంశాల్లో రాజీ పడాల్సి ఉంటుంది. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, పవర్ విండోలు, ఎలక్ట్రిక్ ORVMలు, రియర్ AC వెంట్స్, USB ఛార్జింగ్ పోర్టులు లాంటి ఫీచర్లు ఇందులో లేవు. ఒకవేళ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కావాలంటే అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
భద్రత విషయంలో మాత్రం టాటా ఎలాంటి రాజీ పడలేదు. స్మార్ట్ వేరియంట్ లోనే 6 ఎయిర్ బ్యాగ్ లు, ABSతో EBD, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, అన్ని సీట్లకు 3 పాయింట్ సీట్ బెల్ట్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు లాంటి కీలక భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ధరలో ఇలాంటి భద్రతా ప్యాకేజ్ లభించడం పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు.
ఇంజిన్ విషయానికి వస్తే, 1.2 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో ఈ కారు వస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అందుబాటులో ఉంటుంది. CNG ఆప్షన్ కూడా లభిస్తుంది. అయితే AMT ఆటోమేటిక్ గేర్ బాక్స్ స్మార్ట్ వేరియంట్ లో అందుబాటులో లేదు. తక్కువ ధరలో భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే కొనుగోలుదారులకు టాటా టియాగో స్మార్ట్ మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
Read Also: ఆటోమేటిక్ కార్లు కొనాలనుకుంటున్నారా? తక్కువ ధరలో బెస్ట్ మోడల్స్ ఇవే!